కనుమరుగవుతున్న కవచం (పశ్చిమగోదావరి)
నర్సాపురం, నవంబర్ 2 : ప్రకృతి ప్రకోపించి ఊళ్ల మీదకు వచ్చే సముద్ర కెరటాలకు అడ్డుగా నిలిచే మడ అడవులను కొంత మంది స్వార్థపరులు హరిస్తున్నారు. వీటి సంరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కిలోమీటర్ల సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం కోతకు గురవుతుండటంతో స్థానికులు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు. గతంలో సముద్రం కోతకు గురై బియ్యపుతిప్ప, చినమైనవానిలంక గ్రామాలు కడలి గర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం పీఎంలంక, కేపీపాలెం మధ్య ప్రాంతం కోతకు గురవుతోంది. గతంలో నరసాపురం మండలంలోని దర్భరేవు, బియ్యపుతిప్ప తదితర గ్రామాల్లో గోదావరి తీరంలో సుమారు వేయి ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు ఉండేవి. ప్రస్తుతం కేవలం 100 ఎకరాల్లో మాత్రమే ఇవి విస్తరించాయి. దర్భరేవులో అడమొగల్తూరు మండలంలోని పేరుపాలెంసౌత్, పేరుపాలెంనార్తు గ్రామాల పరిధిలోని ఉప్పుటేరులకు ఆనుకుని ఉన్న సుమారు 500 ఎకరాల్లో మడ అడవులు ఉండేవి. జిల్లాకు ఆనుకుని ఉప్పుటేరుకు అటువైపు ఉన్న కృష్ణాజిల్లా గొల్లపాలెంలో కూడా వేలాది ఎకరాల్లో మడ ఆడవులు ఉండేవి. ఇటీవల అలలు దిశ మారడంతో కేపీపాలెంలో సముద్ర కోత ఎక్కువగా ఉంటుంది. దీంతో తీరంలోని భూములు కోతకు గురై సముద్రంలో కలిసిపోతున్నాయి. గత పదేళ్లలో తీరప్రాంతంలో వందల ఎకరాల్లో కొబ్బరి, సర్వీ తోటలు గల్లంతయ్యాయి.
మడ అడవులు..తీర ప్రాంతంలో సహజసిద్ధంగా పెరుగుతాయి. అనేక జలచరాలు వీటి నీడన తలదాచుకుంటాయి. చేపల వంటి జలచరాలు తమ ప్రత్యుత్పత్తికి దోహదపడే గుడ్లను పెడుతూ జీవనం సాగిస్తాయి. ప్రకృతిలో జీవావరణ వ్యవస్థకు కావాల్సిన సమతూకాన్ని కాపాడటంలో మడ అడవులు కీలకంగా నిలుస్తాయి. గతంలో ఉన్న మడ అడవులను వంట చెరకు, ఇతర అవసరాలు, ఆక్వా చెరువుల నిమిత్తం తొలగించడంతో తీర ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉంది. సముద్ర తీరం వెంబడి గతంలో దట్టమైన మడ అడవులు, సరుగుడు చెట్లు ఉండేవి. తుపానులు విపత్తులు, ఉప్పెనలు వచ్చినప్పుడు అవి నష్ట తీవ్రతను తగ్గిస్తాయి. జిల్లాలో గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేదికి, సముద్ర ముఖ ద్వారానికి ఎదురుగా ఉండే దర్భరేవు ప్రాంతంలో గతంలో అటవీశాఖ మడ అడవులను అభివృద్ధి చేసింది. ఉప్పుటేరు సముద్రంలో కలిసే స్ట్రెయిట్‌కట్ ప్రాంతానికి అనుసంధానంగా పాతపాడు, నాగిడిపాలెంలో కూడా మడ అడవుల పెంపకానికి చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో కాకినాడ తీరం కోరంగిలో మడ అడవులను సంరక్షిస్తున్నారు. కొత్తగా మొక్కలు నాటడంతో పాటు పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేశారు. సరిహద్దు రాష్ట్రం తమిళనాడులో పిచ్చవరం, కడలూరు, రామేశ్వరం తీరాల్లో ప్రత్యేక కార్యాచరణ ద్వారా మడ అడవులను అభివృద్ధి చేస్తున్నారు. అన్నామలై విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ ఆచార్యులు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి పరిశోధనలు చేశారు. తమిళనాడు తీర ప్రాంతంలో మడ పెంపకానికి చర్యలు చేపట్టారు. అక్కడి విశ్వవిద్యాలయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఈ అడవుల పెంపకంలో భాగస్వాములను చేసి ఫలితాలు రాబట్టారు. ఇటువంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఈ అడవులు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.