YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

 సోయా.. మాయ (ఆదిలాబాద్)

 సోయా.. మాయ (ఆదిలాబాద్)

 సోయా.. మాయ (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, నవంబర్ 02 జిల్లాలో గత సీజన్‌లో అమ్మిన సోయా డబ్బులు ఇప్పటి వరకు కొంత మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు.. పంటను అమ్మిన రెండు రోజుల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పిన అధికారులు తొమ్మిది నెలలు గడిచినా జమ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకున్న రైతులు తమకు రావాల్సిన డబ్బులకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారుల తప్పిదం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు అమ్మిన సోయా ఏమైంది అనేది తెలియడం లేదు. అధికారుల లెక్కల్లో వారు అమ్మిన వివరాలు లేకపోవడంతోనే డబ్బులు జమ కావడం లేదని తెలుస్తోంది. జిల్లాలో సోయా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు నాఫెడ్‌ ఆధ్వర్యంలో హాకా రైతుల నుంచి గత సీజన్‌లో సోయాను కొనుగోలు చేశారు. వాస్తవంగా పంటను అమ్మిన వారం రోజుల్లోగా డబ్బులు జమ కావాలి. కానీ రైతులు పంటను అమ్మిన రెండు, మూడు నెలల తర్వాత సంబంధిత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అమ్మిన రైతుల్లో 83 మంది రైతులకు ఇప్పటివరకు డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారిలో కొంత మంది రైతులు తాము అమ్మిన చోట అడిగితే, కొనుగోలు చేసిన సోయాను నాఫెడ్‌కు పంపించామని చెబుతున్నారు. అక్కడి నుంచే డబ్బులు రావాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో రైతులు నాఫేడ్‌ ఉన్నతాధికారులను సంప్రదిస్తే మీరు సోయా అమ్మినట్లుగా మా దగ్గర ఎలాంటి సమాచారం లేదని, అమ్మిన చోటనే అడగాలని చెబుతున్నారు. దీంతో తాము అమ్మిన సోయా ఎటు పోయిందని, ఎలా మాయమైపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రైతులకు డబ్బులు జమ చేసే పనిలో ఉన్నారు. ఆదిలాబాద్‌ మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన అత్రం దత్తు ఆదిలాబాద్‌ మార్కెట్‌లో జనవరి ఎనిమిదో తేదీన 34 బస్తాల సోయాను రూ.3,399తో హాకాకు అమ్మారు. ఇతనికి రావాల్సిన డబ్బులు రూ.59,783 ఇప్పటికి వరకు ఖాతాలో జమ కాలేదు. అప్పటినుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 83 మంది రైతులు డబ్బులు జమ కాకపోవడంపై సంబంధిత అధికారులను ఆరా తీస్తే.. సోయాను కొనుగోలు చేస్తున్న నాఫెడ్‌ ఏ రోజుకారోజు రైతుల నుంచి కొనుగోలు చేసిన సోయా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. దీన్ని బట్టి ఉన్నతాధికారులు సంబంధిత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. కొనుగోళ్లకు గడువు విధించిన నాఫెడ్‌ ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేసింది. ఇది తెలియని ఆదిలాబాద్‌లోని హాకా, జైనథ్‌లోని సహకార సంఘం గడువు తర్వాత కూడా కొనుగోలు చేసింది. కానీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. జిల్లాలోని 83 మంది రైతులు సోయాను అమ్మినట్లుగా నాఫెడ్‌ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ఈ కారణంగానే డబ్బులు జమ కావడం లేదని అధికారులు రైతులకు చెబుతున్నారు. ఈ మేరకు హాకా అధికారులు పూర్తి వివరాలతో ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా లేఖలు రాసిన నాఫెడ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని సమాచారం. అసలు రైతులు అమ్మిన సోయా అధికారుల లెక్కల్లో ఉంటే ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే, శనగ సాగుకు ఉపయోగపడుతాయని రైతులు అంటున్నారు. జిల్లా మొత్తంలో రూ.60 లక్షలు రైతులకు రావాల్సి ఉంది. 

Related Posts