
ఇంత నిర్లక్ష్యమా..? (కరీంనగర్)
కరీంనగర్, నవంబర్ 02 : నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూగర్భ మురుగు కాల్వ పనులు(యూజీడీ) కొనసాగుతున్నాయి. గతంలో చేపట్టిన పనులతో పాటు కొత్తగా వేస్తున్న రహదారుల్లో 20.63 కి.మీ నిర్మిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ మురుగు కాల్వ పైపులైన్లు విస్తరించే పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం కొన్ని డివిజన్ల పరిధి నుంచి మురుగు నీటిని తరలిస్తుండటతో మూడేళ్లుగా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పని చేస్తుండటంతో మురుగు నీటిని, వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. 2008 సంవత్సరంలో మురుగు శుద్ధి కేంద్రం పనులు ప్రారంభించారు. నగర వీధుల్లో 290 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు, ట్రంకు లైన్లు, మ్యాన్‌హోల్ ఛాంబర్లు, ఇన్‌స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించారు. గోపాల్ చెరువు దగ్గర 10 ఎకరాల స్థలంలో 38 ఎంఎల్‌డీల సామర్థ్యంతో మురుగు శుద్ధి కేంద్రాన్ని చేపట్టారు. పనులు పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చారు. నగరంలోని దిగువ ప్రాంతంలో అయిదు డివిజన్లకు సుమారు 4,500 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం రోజుకు 2 ఎంఎల్‌డీల నీటిని శుద్ధి చేసి సమీపంలోని చెరువుల్లోకి పంపిస్తున్నారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగు, మానవ వ్యర్థాలన్నీ భూగర్భ మురుగు కాల్వ ద్వారా ఎస్టీపీకి తరలిస్తున్నారు. వాస్తవంగా అంతర్గత మురుగు నీరే తరలించాలని నిర్ణయించినా, శుద్ధి కేంద్రానికి ఆ నీరు సరిపోవడం లేదు. ఇంటి నుంచి వచ్చే మురుగు నీటితో పాటు మరుగుదొడ్డి, సెప్టిక్ ట్యాంకు నుంచి వచ్చే వ్యర్థాలు శుద్ధి కేంద్రానికి చేరుతున్నాయి.
భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వీలుగా నిధులను కేటాయించారు. రూ.25 కోట్లతో ఈ పనులు చేసేందుకు ప్రజారోగ్యశాఖ చర్యలు తీసుకుంది. దీంతో వీధుల్లో కొత్తగా నిర్మించే రహదారులపై మ్యాన్‌హోల్ ఛాంబర్ నుంచి ఇంటివరకు సైడ్ ఇన్‌స్పెక్షన్ ఛాంబర్లు నిర్మిస్తున్నారు. కాని ఇంటి నుంచి ఇంటి ముందున్న ఛాంబర్ వరకు మాత్రం కనెక్షన్ ఇవ్వడం లేదు. నగర పరిధిలో మురుగు నీటిని తరలించి శుద్ధి చేసేందుకు ఇంటింటా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే 4 వేల కనెక్షన్లు ఇవ్వగా మరో 19,961 ఇన్‌స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించే వీలుంది. ఇప్పటివరకు 8,685 పూర్తికాగా మిగతా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వీటిని నిర్మించకుండా పైపులైన్లు వేస్తుండటంతో మురుగు తరలించేందుకు మరింత ఆలస్యమవుతోంది. 19 వేల ఇళ్లకు ఇంటింటా కనెక్షన్లు కనెక్షన్లు ఇస్తే నగరంలోని సగ ప్రాంతం నుంచి మురుగు నీటిని శుద్ధి కేంద్రానికి తరలించే అవకాశం ఉంది. భూగర్భ మురుగునీటి కాల్వల నిర్మాణం కోసం రోడ్లు తవ్వకుండా నగరమంతా పైపులైన్ల కనెక్షన్లు ఇస్తున్నారు. ఆ కనెక్షన్లకు ఇంటింటా కలుపాలి. ప్రధాన రహదారులపై ఉన్న అనుసంధాన లైన్లులన్నీ పూర్తి చేయాలి. నగరంలో 45 వేల ఇళ్ల నుంచి మురుగునీటిని శుద్ధి కేంద్రానికి తరలించడానికి అవకాశం ఉంది. స్మార్ట్‌సిటీలో ఎంపిక చేసిన డివిజన్ల గుండా కచ్చితంగా మురుగునీరు పంపించేలా చూడాలి.