డ్రిప్ ట్రబుల్స్ (వరంగల్)
వరంగల్, నవంబర్ 02: కరవులో రైతుల్ని ఆదుకునేందుకు సూక్ష్మసేద్య పథకం ఉపయోగపడుతోంది. ఇలాంటి బృహత్తర పథకానికి నిధుల కేటాయింపులో ప్రభుత్వం మంగళం పాడినట్లు స్పష్టమవుతోంది. రబీ సీజన్ ప్రారంభమైనా.. ఇప్పటి వరకు ఈ పథకానికి ప్రభుత్వం నిధులు రాలేదు. వచ్చే అవకాశం కూడా లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పథకం ప్రధానంగా ఉద్యాన పంటలకు మేలు చేస్తోంది. రబీ, వేసవి సీజన్‌లలో బిందు, తుంపర పరికరాలతోనే పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసుకునేందుకు బిందు పరికరాలు రైతులకు మేలు చేస్తున్నాయి. పండ్లు, కూరగాయలను అన్ని కాలాల్లో పండించేందుకు బిందు, తుంపర సేద్యం రైతులకు ఉపయోగకరంగా మారింది. 2006 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సూక్ష్మ సేద్య పథకాన్ని అమలు చేస్తోంది. ఉద్యాన పంటలతోపాటు ఇప్పుడు పత్తి, వరి, మొక్కజొన్న వంటి పంటల్లో సైతం బిందు పరికరాలతో సాగునీటిని అందిస్తున్నారు. బిందుసేద్య పరికరాలను 2012 వరకు 50 శాతం వరకు, తుంపర పరికరాలను 33 శాతం రాయితీపై సరఫరా చేసే వారు. ఆ తరువాత రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రాయితీలను మార్చింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సూక్ష్మసేద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. దీంతో ఉద్యాన పంటలసాగులో బిందు సేద్యం కీలకంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఏడాది వరకు సూక్ష్మ సేద్య పథకాన్ని అమలు చేశారు. గతంతో పోల్చుకుంటే నిధుల కేటాయింపు చాలా వరకు తగ్గింది. గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిందు, తుంపర పరికరాలను రాయితీపై రైతులకిచ్చేందుకు రూ. 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో మార్చి వరకు బిందు పరికరాలను ఉద్యాన రైతులకిచ్చారు. నిధులు కూడా 2018 మే మాసంలోనే ప్రభుత్వం కేటాయించింది. ఈసారి ఆరు జిల్లాల్లోని ఉద్యానశాఖ అధికారులు బిందు పరికరాల అవసరాలను గుర్తించి ఏప్రిల్‌లోనే ప్రతిపాదనల్ని రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. మే లోనే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఇప్పటి వరకు పథకం అమలు విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కనీసం నిధుల కేటాయింపు కూడా లేదు. గత ఏడాది వరకు ఆర్‌కేవీవై పథకం ద్వారా సూక్ష్మసేద్య పరికరాలను రైతులకు అందించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నాబార్డు రుణం అందించింది. మిగతా నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో పథకం అమలు సక్రమంగా సాగింది. ప్రస్తుతం ఆర్‌కేవీవై పథకం అమలు గడువు ముగిసి నాబార్డు నుంచి నిధుల కేటాయింపు ఆగిపోయింది. కేంద్రం నుంచి నిధులు మంజూరు లేదు. దీంతో ఈ పథకం కొనసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులను భరించాల్సి ఉంటుంది. బిందు సేద్యంలో రైతులకు అందించే రాయితీలు ఎక్కువగా ఉండటంతో దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఈసారి పథకం అమలు విషయమై ఇప్పటి వరకు అధికారులకు సైతం సమాచారం లేదు. దీంతో ఉద్యాన రైతులు ఆందోళన చెందుతున్నారు.