Highlights
- ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదాన చేసుకున్న త్యాగమూర్తి
- ఆ స్ఫూర్తితోనే ఉద్యమాలు
- ముఖ్యమంత్రి చంద్రబాబు
- టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా అమరజీవి జయంతి
ప్రతి తెలుగువాడూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి పొట్టిశ్రీరాములు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం తెలుగుదేశం ఆధ్వర్యంలో కీ శే పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు ఆ ధన్యజీవి స్మృతికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రానంతరం ఆంధ్రుల గుర్తింపు కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆత్మ బలిదాన చేసుకున్న త్యాగమూర్తి శ్రీరాములు అని కొనియాడారు. ఆ మహోన్నత త్యాగం రగిలించిన స్ఫూర్తితోనే ఆనాడు అనేక చోట్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఊపందుకున్నాయని గుర్తు చేశారు. దాంతో మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటుకు దారి తీసిందని చెప్పారు. ఫలితంగా ఎన్నో కొత్త భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందుకే శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష భారత దేశ చరిత్రలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని చంద్రబాబు తెలిపారు.