13 ఏళ్ల క్రితం రిటైరైనా...ఇంకా ఉద్యోగంలోనే
తిరుమల,
శ్రీవారి ఆలయంలో పాతుకుపోయిన డాలర్ శేషాద్రిని కదపడం ఎవరి వల్లా కావడంలేదు. ఆయనది నాలుగున్నర దశాబ్దాల ఉద్యోగ చరిత్ర. ఇంతలా సుదీర్ఘకాలం పనిచేసిన వారు వేరే ఎవరూ లేరు. 1977లో శ్రీవారి ఆలయంలో ఓ చిన్న ఉద్యోగిగా చేరిన డాలర్ శేషాద్రి 2006లో పదవీ విరమణ చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకూ అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఆలయంలో కొనసాగుతున్నారు. ఓఎస్డీ గా ఆయన సేవలు ఎందరు ముఖ్యమంత్రులు మారినా సాగిపోతున్నాయి. ఏపీలో తీసుకుంటే వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, ఇపుడు జగన్ ఇలా ఏలికలు ఎవరు ఉన్నా డాలర్ శేషాద్రిదే ఇక్కడ హవాగా ఉంది. ఎంతో మంది టీటీడీ అధికారులు వచ్చినా కూడా, ఎవరిని తొలగించినా శేషాద్రిని మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉండిపోయారు. ఇక గత కొద్ది రోజులుగా శేషాద్రిని తప్పిస్తున్నారని ప్రచారం అయితే జరిగింది కానీ చివరికి ఆయన ఏ విధమైన కుదుపు లేకుండా మళ్ళీ కొనసాగుతున్నారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే వందమంది వరకూ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని టీటీడీ బోర్డ్ ఇంటికి పంపించేసిందని సమాచారం. అయితే అందులో డాలర్ శేషాద్రి పేరు లేదంటున్నారు. దటీజ్ శేషాద్రి.శ్రీవారి ఆలయంలో చీమ చిటుక్కుమన్నా కూడా డాలర్ శేషాద్రి ఉండాల్సిందే. అంతలా ఆయన పట్టు సంపాదించేశారు. ఆయన ఇందిరాగాంధీ జమానా నుంచి ఎందరినో చూసుకుంటూ వస్తున్నారు. అందువల్ల ఆయన కంటే రాజకీయం ఎత్తులు పై ఎత్తులు తెలిసిన వారు ఎవరూ లేరు. ఇక ఆలయ మర్యాదలే కాదు, ఏకంగా శ్రీవారి పూజలు చేయించడంతో డాలర్ శేషాద్రిని ఉన్న పట్టు ఎవరికీ లేదని అంటారు, ఇక బ్రహ్మోత్సవాల సమయంలో డాలర్ శేషాద్రి మొత్తం కార్యక్రమాలను దగ్గరుండి జరిపిస్తారు. ఆయన లేకపోతే మిగిలిన వారికి ఏం చేయాలో పూర్తిగా తెలియందంటారు. అంతలా ఆయన శ్రీవారి ఆలయంలో అవసరమై కూర్చున్నారు.ఇక డాలర్ శేషాద్రిపై ఆరోపణలు ఎన్నో వచ్చాయి. ఆయన 2004 నుంచి 2006 మధ్యలో బొక్కసం అధికారిగా ఉన్నపుడే డాలర్లు మూడు వందల పై చిలుకు పోయాయని ఆరోపణలు వచ్చాయి. అయినా ఆయన ఎలాగో బయటపడ్డారు. ఇక డాలర్ శేషాద్రిని పదవి ఉంచి తప్పించాలని 2009 సమయంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ డాలర్ శేషాద్రి తప్పించుకున్నారు. ఆయన తన పలుకుబడి ఉపయోగించుకుని కాంట్రాక్ట్ బేసిస్ లో ఈ రోజు వరకూ పదవి లో కొనసాగుతున్నారు. అటువంటి కొరుకుడుపడని ఉక్కు పిండం డాలర్ శేషాద్రిగా చెప్పుకుంటారు. ఇక ఆలయంలో అధిపత్య పోరుకు తెర తీసిన వారిగా కూడా డాలర్ శేషాద్రి మీద ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఆయన్ని కదపడం అంటే మాటలు కాదంటారు. మరి డాలర్ శేషాద్రి ఏ జన్మలొ చేసుకున్న పుణ్యమో కానీ శ్రీవారి ఆలాయంలో అలా దశాబ్దాలుగా కొనసాగుతున్నారని అంటారు. గిట్టని వారు సైతం ఆయన్ని పుణ్యంతోనే ఇన్నాళ్ళు నెట్టుకు వస్తున్నారని అంటారు. ఏది ఏమైనా డాలర్ శేషాద్రి గ్రేట్ అనిపించేసుకున్నారు.