బోర్ల వినియోగంతో అడుగంటున్న భూగర్భ జలాలు
మహబూబ్ నగర్, నవంబర్ 4,
జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది సరిగా వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటాయి.గ్రామాల్లో చేతిపంపులు ఎండిపోయి ప్రజలు నీటి ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, పొలాల్లో తవ్వుకున్న బోర్లు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో తక్కువ వర్షపాతమే నమోదైంది. భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేకంగా నిధులున్నా సరిగా వినియోగించటం లేదు. పభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో కొందరు రైతులు అవసరం లేకున్నా నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తుండటంతో బోర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. భూమిలోకి నీటిని ఇంకించడానికి అవసరమైన ప్రాంతాల్లో నీటికుంటలు, కందకాలు, చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టకపోవడం, మరోవైపు ఎక్కువగా నీటి తవ్వకంతో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. అధికారులు భూగర్భజలాల పెంపునకు తగిన చర్యలు తీసుకోవాలి.