2018 మార్కెట్‌పై నిర్మాణదారుల విశ్వాసం
రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి సంస్థ(రెరా) అథారిటీ ఏర్పాటులో జాప్యం గత ఏడాది కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభంపై ప్రభావం చూపింది. 2017లో నిర్మాణదారులు వేచిచూసే ధోరణిలో ఎక్కువ సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభానికి వెనకడుగు వేశాయి. వ్యవస్థీకృత స్థిరాస్తి మార్కెట్‌లో కొన్ని సంస్థలు మాత్రమే గత ఏడాది కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించాయి. వారు సైతం కొనుగోలుదారుల నుంచి అడ్వాన్స్ తీసుకోవడంలో డోలాయమానంలో ఉన్నారు. రెరా చట్టం ప్రకారం అథారిటీ వద్ద నమోదు కాకుండా అడ్వాన్స్ సైతం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. అథారిటీ సత్వరం ఏర్పాటు అవుతుందనే ఆశాభావంతో స్థిరాస్తి పరిశ్రమ ఎదురుచూస్తుండగా తాజాగా సర్కారు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా)గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీని నియమించింది. నిర్మాణదారులు, కొనుగోలుదారుల మధ్య వివాదాల పరిష్కారాలకు ప్రత్యేకంగా రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. రెరాను స్వాగతించిన స్థిరాస్తి సంఘాలు.. మరింత జాప్యం జరగకుండా సభ్యులను నియమించి పూర్తిస్థాయి అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
41 శాతం తగ్గుదల
వ్యవస్థీకృత రంగంలో ఏటా కొత్త ఇళ్లు 25వేల పైనే ఉంటాయి. 33వేల వరకు చేరుకుంటాయని అంచనాలు ఉన్న సమయంలో పెద్ద నోట్ల ఉపసంహరణ, జీఎస్టీ, రెరా వరుస కుదుపులతో కొత్త యూనిట్లు బాగా తగ్గిపోయాయి. ప్రాపర్టీటైగర్ సంస్థ తాజా నివేదిక ప్రకారం.. 2016లో 26,895 యూనిట్లు ప్రారంభిస్తే.. గత ఏడాది 15,916 యూనిట్లకు పడిపోయింది.
* రెరా ప్రభావం చివరి త్రైమాసికంలో ఎక్కువగా కనిపించింది. పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రభావం తొలగిపోవడం, జీఎస్‌టీపై కొంత స్పష్టత వచ్చింది. రెరానే ఏర్పాటు కాకపోవడంతో కొత్తవి ప్రారంభించినా విక్రయానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో నూతన ప్రాజెక్ట్‌లను చాలా సంస్థలు వాయిదా వేశారు. దీంతో 2016 ఆఖరి త్రైమాసికంలో 7190 యూనిట్లను ప్రారంభిస్తే.. గత ఏడాది కేవలం 4,410 మాత్రమే మొదలయ్యాయి. ఇది 39 శాతం తగ్గుదల. 2018లో ఇలాంటి అవరోధాలను అధిగమిస్తారనే ధీమాని పరిశ్రమ వర్గాలు వ్యక్తంచేశాయి. 2016లో వ్వవస్థీకృత మార్కెట్‌లో 20,500 యూనిట్లు విక్రయిస్తే.. గత ఏడాది 21వేల విక్రయాలు జరిగాయి. ఇది రెండు శాతం అధికం. గత ఏడాది చివరి త్రైమాసికంలో విక్రయాలు పెరిగాయి.