YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సొంతింటి కల నెరవేరేనా..? (కృష్ణాదిల్లా)

సొంతింటి కల నెరవేరేనా..? (కృష్ణాదిల్లా)

సొంతింటి కల నెరవేరేనా..? (కృష్ణాదిల్లా)
మచిలీపట్నం,

: అర్హులైన పేదలందరికీ ఇళ్లు కేటాయించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం నగరంలో జీప్లస్‌త్రీ విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది.  ఈమేరకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి 6,400 ఇళ్లు కేటాయించారు. దీంతో వివిధ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడంతోపాటు సగానికిపైగా ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం అందరికీ ఇళ్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో ఎవరు అర్హులు, అనర్హులు ఎంతమంది తదితర అంశాలపై విచారణ నిర్వహించడంతో ఇళ్లు ఇస్తారో లేదోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బందరులో నిర్మించనున్న 6,400 ఇళ్లకు రూ.444.51 కోట్లు గతంలోనే మంజూరు చేశారు. జీప్లస్‌త్రీ ఇళ్ల నిర్మాణంలో భాగంగా స్థానిక దేశాయిపేట ప్రాంతంలో 11 ఎకరాలు, మండల పరిధిలోని రుద్రవరంలో సేకరించిన 25 ఎకరాల్లో పనులు చేపట్టారు.  ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణ పనుల్లో కొంత జాప్యం ఏర్పడింది. గోసంఘంలో 11 ఎకరాల్లో 960 బ్లాకుల నిర్మాణం, రుద్రవరంలోని 25 ఎకరాల్లో మూడువేలకుపైగా బ్లాకుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల్లోనూ పనులు చివరిదశకు చేరుకున్నాయి. 6,400 ఇళ్లకు 4,176 ఇళ్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 2,224 ఇళ్లు కేటాయించాల్సి ఉంది. దానికి 25 ఎకరాల స్థలం కావాలని అధికారులు నిర్ణయించి శివగంగ ప్రాంతంలో స్థల సేకరణకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉగాది నాటికి ఇళ్లులేని వారందరికీ ఇళ్లు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా నగరంలోని 42 వార్డుల ప్రజలనుంచి దరఖాస్తులు ఆహ్వానించగా 13వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది.  జీప్లస్‌త్రీ ఇళ్లు పొందిన 4,176మందిలో పలువురికి ఇళ్లు ఉన్నట్లు అధికారులు భావిస్తుండడంతో మళ్లీ వార్డుల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మూడు విభాగాలుగా జీప్లస్‌త్రీ ఇళ్లు నిర్మిస్తున్నారు. 300 చదరపు అడుగులు, 365, 430 చదరపు అడుగుల్లో ఇళ్లు నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటికి ఒక్కో రకంగా లబ్ధిదారుడు తన వాటా చెల్లించాల్సి ఉంటుంది. 300 చదరపు అడుగుల ఇంటికి లబ్ధిదారుడు తన వాటాగా రూ.500లు చెల్లించాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం    రూ.1.50లక్షలు, కేంద్రప్రభుత్వం రూ.1.50 లక్షలు అందజేస్తుంది.మరో రూ.2.64లక్షలు బ్యాంకు రుణంగా అందించాలి. అదే 365 చ..అ ఇంటికైతే లబ్ధిదారుడు రూ.50వేలు చెల్లించాలి. ప్రభుత్వాలు ఈ ఇంటికీ కూడా రూ.3లక్షల రాయితీ అందిస్తాయి. మరో రూ.3.15లక్షలు బ్యాంకు నుంచి రుణం ఇవ్వాలి. అదే 430 చదరపు అడుగుల ఇంటికైతే లబ్ధిదారుడు రూ.లక్ష చెల్లించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా ఇచ్చే రూ.3లక్షలు కాకుండా మరో రూ.3.65లక్షలు బ్యాంకు రుణం ఇప్పించాలి. లబ్ధిదారులు అందరూ తమ వాటాగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటికే డీడీల రూపంలో చెల్లించారు. ప్రస్తుతం బ్యాంకు రుణంతో పనిలేకుండా లబ్ధిదారులు డీడీల రూపంలో ఎంత చెల్లించారో అంతకే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో లబ్ధిదారులు సంతోషించినా సర్వేలో ఎవరి పేరు ఉంటుందో ఎంతమంది పేర్లు తీసేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలో కూడా లబ్ధిదారుల్లో పలువురికి ఇళ్ల స్థలాలు ఉండడంతోపాటు ఇళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఎంతమందిని తొలగిస్తారన్నది తెలియాల్సి ఉంది.  

Related Posts