సోలార్ సంగతేంటి..? (నెల్లూరు)
నెల్లూరు,: కరెంట్ లేకపోయినా పల్లెల దాహం తీర్చే సోలార్ సాంకేతిక వ్యవస్థ జిల్లాలో ప్రారంభమై రెండేళ్లు పూర్తికాక ముందే విఫలమైంది. విద్యుత్తు లేక నీటి సరఫరా ఆగిపోతున్న గ్రామాల్లో బోర్ల వద్ద సోలార్ డ్యూయల్ పవర్ పంపుల విధానాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు సంవత్సరం పాటు ప్రజల కష్టాలు తీరాయంటే సోలార్ వ్యవస్థ పుణ్యమే. ఆ తరువాతే అసలు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. విద్యుత్తు సరఫరాలో అవస్థలు పడుతున్న బోగోలు, కొండాపురం, వింజమూరు, నాయుడుపేట, చిట్టమూరు, తదితర మండలాల పరిధిలోని ఈ హ్యాబిటేషన్ల బోర్‌వెల్స్‌కు సోలార్ ద్వారా నీటి సరఫరాను ప్రారంభించారు. పంపులను బిగించి బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసే ప్రక్రియను 2017లో ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ప్రధానంగా సోలార్ విధానంలో మంచి నీటి పథకాల బోర్ల వద్ద సింథటిక్ ట్యాంక్‌లను ఏర్పాటు చేసి స్టీల్ పైపులతో నిచ్చెన అమర్చుతారు. ఒక ప్రత్యేక సిస్టం ద్వారా ట్యాంక్‌ను నీటితో నింపుతారు. కరెంట్ లేకపోయినా సింథటిక్ ట్యాంకులో ఉన్న నీటిని గ్రామాలకు సరఫరా చేసేవారు. ఎస్‌ఆర్ పురంలో ఒకటి, కలిగిరిలో మూడు, విడవలూరులో ఒకటి, ఇందుకూరుపేటలో రెండు, కొడవలూరులో మూడు ఇలా పేదలు నివసించే హ్యాబిటేషన్‌లలో ఏర్పాటు చేశారు. మొత్తం 107 సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం సగానికి పైగా పనిచేయడం లేదు. పరికరాలు పలు చోట్ల ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. పలకలు పగిలిపోతున్నాయి. తీగలు తెగిపోయి అనేక లోపాలతో దర్శనమిస్తున్నాయి. అధికారులు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ పనులు చేసిన వారు అయిదేళ్లపాటు పర్యవ్యేక్షించాలి. దాదాపు ఆరు మాసాల నుంచి సోలర్ పరికరాలు పనిచేయక పోయినా పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.చివరికి అధికారులు కూడా స్పందించ లేదు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులకు అందిన సమాచారం ప్రకారం 42 సోలార్ పంపులు పనిచేయడం లేదు.