రాజధానిపై వైసీపీ మైండ్ గేమ్
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై జరుగుతున్న ప్రచారం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటివరకు నోరు విప్ప లేదు. రాజధాని ఇక్కడే కొనసాగుతుందా ? లేక మార్చనున్నారా ? లేక కొత్త కార్యాచరణ మొదలు పెడతారా ? దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ముఖ్యమంత్రి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాంతోనే పలువురిలో అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరువాత కృష్ణా నదికి వరదలు వచ్చాయి..ఆ సమయంలో రాజధాని మార్పు అంశాన్ని తొలిసారి చర్చకు పెట్టారు మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ. ముంపు ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపడితే వేలకోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు టిడిపి నేతలు, చంద్రబాబు బంధువులు రాబంధవుల్లా అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పాలపడ్డారంటూ కొందరి చిట్టా విప్పారు. అంతే ఒక్కసారిగా టిడిపి వర్గాలు బొత్స వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి.అయితే అప్పటినుంచి బొత్స సత్యనారాయణ ఏదో ఒక సందర్భంలో రాజధాని అంశంపై బాంబులు పేలుస్తూ వస్తూనే ఉన్నారు. ఆయన మాటలతో రాజధాని ప్రాంత రైతులతో టిడిపి ఉద్యమాలు మొదలు పెట్టింది. బిజెపి కి చెందిన సుజనా చౌదరి రంగంలోకి దిగిపోయారు. ఆయన కూడా జగన్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. తక్షణం దీనిపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడకపోయినా రాజధాని నిర్మాణంపై కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక ఇంకా రాకుండా తాజాగా బొత్స సత్యనారాయణ మరోసారి చంద్రబాబు సారధ్యంలోని గత ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ చెలరేగిపోయారు. 50 అంతస్థుల ఆకాశహార్మ్యాలు అంటూ ఎద్దేవా చేశారు. గ్రాఫిక్స్ తప్ప చంద్రబాబు చేసిందేమిటని సినిమా వాళ్ళతో డిజైన్లు ఏమిటంటూ దుమ్మెత్తిపోశారు. మీ గ్రాఫిక్స్ మీ దగ్గరే వుంచుకోండంటూ కూడా సెటైర్లు పేల్చారు.
రాజధాని కొనసాగింపుపై ముఖ్యమంత్రి జగన్ మైండ్ గేమ్ బొత్స సత్యనారాయణ తో చేయిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి లో క్యాపిటల్ పెట్టాలన్న ఆలోచనకు ముందే తమ బంధువులకు టిడిపి అధినేత కేటాయించిన భూములను రద్దు చేస్తూ వైసిపి సర్కార్ జారీ చేస్తున్న జీవోలు విపక్ష పార్టీని జగన్ లక్ష్యంగా చేసుకున్న తీరును బయటపెడుతున్నాయి. గతంలో అడ్డగోలుగా నడిచిన యవ్వారం ఒక్కొటొక్కటిగా వెలికి తీసి చర్చ పెట్టి రచ్చ చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తేలుతుంది. రాజధాని ముసుగులో జరిగిన బాగోతం గతంలో వైసిపి చేసిన ఆరోపణలు నిజమని నిరూపించే పనిని అందుకే జగన్ వేగవంతం చేశారని ఇందులో బొత్స సత్యనారాయణ తన పాత్ర తాను పోషిస్తున్నట్లు టాక్.