నాడు కళ కళ.. నేడు వెల వెల (పశ్చిమగోదావరి)
ఏలూరు, నవంబర్ 04 (న్యూస్ పల్స్): ఒకప్పుడు బీఈడీ కళాశాలలు విద్యార్థులతో కళకళలాడేవి. తర్వాత కాలంలో డీఎడ్‌కు డిమాండ్ పెరగడంతోపాటు రెండేళ్ల కోర్సు పూర్తిచేసినా డీఎస్సీలో ఎస్‌జీటీ పరీక్షకు అనుమతి లేకపోవడంతో బీఈడీకి ఆదరణ తగ్గింది. ఇప్పటికే పలు కళాశాలలు మూత దిశగా అడుగులు వేయగా.. మరికొన్ని సీట్లను గణనీయంగా తగ్గించుకున్నాయి. 2019-21 సంవత్సర కౌన్సెలింగ్ ప్రక్రియ రెండు విడతలు ముగియగా పలు విద్యా సంస్థల్లో ప్రవేశాల బోణీ లేకపోగా.. మరికొన్నిచోట్ల రెండంకెలు దాటలేదు. ఒకప్పుడు బీఈడీ సీటు దక్కించుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉండేది. ఏడాది పొడవునా చదివితే గాని సీటు లభించేది కాదు. యాజమాన్య కోటాలో సీటు దక్కాలంటే రూ.1.5 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం కళాశాలల్లోని కన్వీనర్ కోటాలోని సీట్లే భర్తీ కావడం లేదు. చాలాచోట్ల 25 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులు విముఖత చూపడంతో చేరిన ఒకరిద్దరికి తరగతులు నిర్వహించాలా లేదా సమీప కళాశాలలకు పంపించాలా అంటూ యాజమాన్యాలు సతమతమవుతున్నాయి.
గతంలో కోర్సు కాలపరిమితి ఏడాది మాత్రమే ఉండేది. రెండేళ్ల కోర్సుగా కొనసాగినా.. సకాలంలో డీఎస్సీ నిర్వహించక పోవడం, డీఎస్సీ నిర్వహించినా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు అర్హత లేకపోవడం. ఎడ్‌సెట్ మే నెలలోనే పూర్తి చేసి ర్యాంకులు కేటాయించినా కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం, ఆపై తరగతుల నిర్వహణకు మరింత జాప్యం. ప్రస్తుత విద్యా సంవత్సరం కౌన్సెలింగ్ పూర్తి చేసినా కన్వీనర్ కోటాలోని సీట్ల భర్తీకి ప్రభుత్వ ప్రకటన వెలువడాల్సి ఉంది. తదనంతరమే తరగతులు నిర్వహించుకునే అవకాశాలున్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకునేందుకు పలు యాజమాన్యాలు సాహసించడం లేదు. బీఈడీ కళాశాలల్లోనూ విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్ అమలు చేస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోవడంతో పాటు అందుబాటులో లేకపోతే ఇబ్బందులు తప్పవని భయపడుతున్నాయి.
నిర్వహణ కష్టతరం ప్రస్తుతం జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో పదిమంది లోపు మాత్రమే విద్యార్థులు చేరారు. నిబంధనల ప్రకారం ఒక యూనిట్(50 మంది విద్యార్థులు)కు ఒక ప్రధానాచార్యుడు, ఐదుగురు బోధన అధ్యాపకులు, ఫైన్ ఆర్ట్స్, వ్యాయామ అధ్యాపకులు ఒక్కొక్కరు ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు రూ.16,500 రుసుములుగా చెల్లించాల్సి ఉండగా.. యాజమాన్య కోటాలో చేరేందుకు అయిష్టంగా వచ్చేవారిలో కొందరు ఏడాదికి రూ.10 వేలకు మించి చెల్లించమని చెబుతున్నారు. అటు అధ్యాపకులకు వేతనాలు సకాలంలో చెల్లిస్తూ, ఇటు తక్కువ రుసుములతో తరగతుల నిర్వహణ అంటే కష్టతరమని పలు యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.