YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ఉపకారమేదీ..? (ఆదిలాబాద్)

ఉపకారమేదీ..? (ఆదిలాబాద్)

ఉపకారమేదీ..? (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, నవంబర్ 04 (న్యూస్ పల్స్): ప్రభుత్వం ఉన్నత విద్యాభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నా అధికారులు సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించడం లేదు. ఇప్పుడు అదే విద్యార్థులకు తలనొప్పిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరు కావాల్సిన ఉపకార వేతనాలకు విద్యార్థులు దూరమవుతున్నారు. కళాశాలను మార్పు చేసినా సాంకేతిక అంశాలను సవరించలేదు. దీంతో విద్యార్థుల ఉపకార వేతనాలు, పరీక్ష కేంద్రం ఏర్పాటు విషయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ ఎంప్లాయీస్‌ డిగ్రీ కళాశాల(ఎయిడెడ్‌)లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. మూసివేత దిశకు చేరుకుంది. కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని విద్యార్థులు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల సంఖ్య తగ్గుముఖంతో మూసివేత దశకు చేరింది. మంచిర్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను కాగజ్‌నగర్‌ ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల(ఎయిడెడ్‌)లోకి మే మాసంలో మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో 138 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా లక్ష్మీనరసింహంను నియమించింది. ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల(ఎయిడెడ్‌)లో ద్వితీయ, తృతీయ సంవత్సరంలో 62 మంది చదువుకుంటున్నారు. ఆ కళాశాలకు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా బెల్లంపల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ కొనసాగుతున్నారు. మంచిర్యాల మహిళా డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరంలో 30 మంది విద్యార్థులుండగా, మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారు చదువుకుంటున్నారు.
కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 138 మంది వివిధ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం చదువుకుంటున్నారు. ఆ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ఉపకార వేతనాల కోసం గురువారం లోపు దరఖాస్తులు చేసుకోవాలి. విద్యార్థులు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసేందుకు యత్నించగా, ఆన్‌లైన్‌లో కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరు లేదు. మంచిర్యాల ప్రభుత్వ మహిళా కళాశాలగా చూపుతోంది. ఇటీవలే డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దృష్టికి ఈ విషయాన్ని పలువురు విద్యార్థులు తీసుకొచ్చారు. సత్వరమే విద్యాశాఖ మంత్రి, కార్యదర్శితో చరవాణిలో మాట్లాడి, సమస్యను పరిష్కరించి, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థులు మంచిర్యాల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలల్లోనే చదువుతున్నట్లు ఉపకార వేతనాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. మంజూరు అవుతాయా? లేదా? సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక డిగ్రీ కళాశాలలో అయిదుగురు విద్యార్థులకు ఇంటర్మీడియేట్‌లో 80 శాతం మార్కులున్నాయి. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రతిభ ఉపకార వేతనం కోసం ఆన్‌లైన్‌లో నమోదుకు యత్నించగా, అదే సమస్య ఎదురైంది. ఆ విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ యూనివర్సీటీలో మంచిర్యాల మహిళా డిగ్రీ కళాశాలకు 426 పరీక్ష కేంద్ర గుర్తింపు నెంబరు కేటాయించారు. ఆ నెంబరు ఆధారంగా పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం ఆ డిగ్రీ కళాశాలను కాగజ్‌నగర్‌కు బదిలీ చేశారు. కాగజ్‌నగర్‌ డిగ్రీ కళాశాలకు ప్రత్యేకంగా గుర్తింపు నెంబరు కేటాయించాలి. నేటికీ కేటాయించలేదు. డిగ్రీ పరీక్ష కేంద్రం మంచిర్యాలలో కేటాయిస్తే.. కాగజ్‌నగర్‌లో చదివే 138 మంది మంచిర్యాలకు వెళ్లి వార్షిక పరీక్షలు రాయాలి. కాగజ్‌నగర్‌కు కేటాయిస్తే మంచిర్యాలలోని మహిళా డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులు కాగజ్‌నగర్‌కు వచ్చి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కేయూ పరీక్షల నియంత్రణ సంచాలకుడు సత్వరమే మంచిర్యాల, కాగజ్‌నగర్‌కు వేర్వేరుగా పరీక్ష కేంద్రాలను కేటాయించాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలలోని ద్వితీయ, తృతీయ సంవత్సరం 62 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ప్రథమ సంవత్సరం విద్యార్థులు 138 మంది మొత్తం 200 మంది విద్యార్థులున్నారు. కేవలం ఇద్దరు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాళ్లు, ఇద్దరు అధ్యాపకులు మినహా అధ్యాపకుల పోస్టులన్నీ ఖాళీలుగా ఉన్నాయి. వచ్చే నెలలో డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధ్యాపకుల కొరత కారణంగా సిలబస్‌ పూర్తి కాలేదు. ఇటీవలే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఎమ్మెల్యే అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని కోరగా, త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిసింది.

Related Posts