దోపిడీ దందా (ఖమ్మం)
ఖమ్మం, నవంబర్ 04 : తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న కొరతతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారులు చోద్యం చూస్తుండటంతో అక్రమార్కులకు అడ్డుఆపు లేకుండాపోతోంది. ఎగువన వైరా నది, దిగువన గోదావరి ఇసుకాసురులకు కాసులు కురిపిస్తోంది. భద్రాద్రి జిల్లాలో గోదావరి, ముర్రేడు తదితర ఉప నదులు ప్రవహిస్తున్నాయి. ముర్రేడులో ప్రస్తుతం నీటి ప్రవాహం కొనసాగుతోంది. గోదావరిలోనూ నీరు ప్రవహిస్తోంది. అయితే అక్కడక్కడ ఎత్తు ప్రదేశాలు ఉండటంతో ఇసుక తరలింపునకు అనుకూలంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. భద్రాచలం సమీపంలో గతంలో అధికారిక ఇసుక రేవు ఉండేది. ప్రస్తుతం లేదు. పాత రేవుకు సమీపంలో ప్రస్తుతం అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ట్రిప్పులు కొడుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌లో 2.5 టన్నుల ఇసుక పడుతోంది. టన్ను ధర రూ.3,000 నుంచి రూ.4,000 వరకు భద్రాచలం ప్రాంతంలో పలుకుతుంది. కాస్తంత ధైర్యం చేసి పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం వరకు తరలిస్తే మరింత ఎక్కువ ధర వస్తుంది. ఒక్కో ట్రాక్టర్‌కు ఖర్చులు పోను ట్రిప్పునకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు యజమానులకు మిగులుతోంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఇసుక తోలకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు మండలాలు ఖమ్మం జిల్లాకు సరిహద్దుగా ఉండటంతో ఇసుక అక్రమార్కులకు బాగా కలిసొస్తోంది. వైరా నది మధిర మండలంలో ప్రవహిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకొని నదిలో నుంచి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లతో ఏపీకి తరలించి సొమ్ము చేసుకొంటున్నారు. నిత్యం 50 నుంచి 60 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. టన్ను రూ.3 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ట్రాక్టర్ల ద్వారా నదిలో ఇసుకను తోడేస్తున్నారు. అయినా ఎవరూ నోరు మెదపడం లేదు. మధిర మండలం చిలుకూరు వద్ద కట్లేరు, వైరా నది కలుస్తుంది. చిలుకూరుకు అటువైపు ఏపీ భూభాగం, ఇటు ఖమ్మం జిల్లా పరిధి విస్తరించి ఉంటుంది. తద్వారా ఇరు ప్రాంతాలకు ఇసుక తరలివెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక రీచ్‌లకు అనుమతులు లేకపోవడంతో స్థానిక ఇసుకను పెద్దఎత్తున తరలించి సొమ్ము చేసుకొంటున్నారు.