YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జెట్ సిటీకి ప్రైవేటు భూ సేకరణ లేనట్టే!

జెట్ సిటీకి ప్రైవేటు భూ సేకరణ లేనట్టే!

జెట్ సిటీకి ప్రైవేటు భూ సేకరణ లేనట్టే!
రైతులకు తిరిగి 106 ఎకరాల భూముల డాక్యుమెంట్లు
 కోర్టు కేసుల పరిష్కారం, ప్రభుత్వ భూముల సేకరణపై దృష్టి
 ‘జెట్ సిటీ’లో బ్యాలెన్స్ పనులను మొదలుపెట్టిన ఎన్సీసీ
విజయవాడ 
జక్కంపూడి ఎకనమిక్ టౌన్షిప్ (జెట్ సిటీ)కి ప్రైవేటు భూములను తీసుకోరాదని నిర్ణయించారు. రెవెన్యూ యంత్రాంగం ప్రతిపాదిత భూముల డాక్యుమెంట్లను రైతులకు వెనక్కిచ్చేస్తోంది. జెట్ సిటీ విస్తరణకు జక్కంపూడి, వేమవరం, షాబాద రైతుల నుంచి తీసుకోవాలని నిర్ణయించిన మొత్తం 106 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తిరిగి వారికి ఇచ్చేస్తున్నారు. ఆయా రైతులు విజయవాడ రూరల్ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ డాక్యుమెంట్లను తీసుకు వెళుతున్నారు. ప్రభుత్వం దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వకపోయినా.. రెవెన్యూ యంత్రాంగం డాక్యుమెంట్లను తిరిగి ఇచ్చేస్తుండటంతో ప్రైవేటు భూ సేకరణ దాదాపుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. విజయవాడ నగర శివారున జక్కంపూడిలో ఆర్థిక నగరాన్ని నిర్మించటానికి తలపెట్టిన జక్కంపూడి ఎకనమిక్ టౌన్షిప్ సిటీ (జెట్సిటీ) విస్తరణకు సేకరించాల్సిన ప్రైవేటు భూముల నుంచి రెవెన్యూ యంత్రాంగం పక్కకు తప్పుకొంది. జక్కంపూడి, వేమవరం, షాబాద రైతుల నుంచి తీసుకోవాలని నిర్ణయించిన మొత్తం 106 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తిరిగి వారికి ఇచ్చేస్తున్నారు. ఎకరం రూ.కోటి పరిహారం చొప్పున రూ.106 కోట్ల మేర పరిహారాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం ఆసక్తితో లేకపోవటంతో.. ఈ భూములను సేకరించే అంశం నుంచి రెవెన్యూ తప్పుకున్నట్టు తెలుస్తోంది. జెట్సిటీ అభివృద్ధి కోసం ప్రజలు నివశించేలా ఇళ్ల నిర్మాణం, పని చేసుకునేలా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో జక్కంపూడిలో ఉన్న 250 ఎకరాల ప్రభుత్వ భూములను ఏపీయూఎంఏఐఎల్కు అప్పగించారు. ఇందులో 28 వేల ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించిన బాధ్యతలను ఏపీ టిడ్కోకు అప్పగించారు. పరిశ్రమల కాంప్లెక్స్లను ఏర్పా టు చేసే బాధ్యత వీఎంసీకి అప్పగించారు. ఏపీ టిడ్కో ఇళ్ళ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) స్కీమ్లో భాగంగా తొలి విడతగా 10,624 ఇళ్ళ నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. తమకు కేటాయించిన భూముల్లో కొండలు ఉన్నాయని, 50 ఎకరాలలో 6 వేల ఇళ్ళ నిర్మాణాలను మాత్రమే కాంట్రాక్టు సంస్థ చేపట్టింది. మిగిలిన ఇళ్ళ పనులు చేప్టడానికి 200 ఎకరాల భూములు ఇంకా అవసరమైంది. ఎకో ఫ్రెండ్లీగా కొండల చుట్టూ ఇళ్ళ నిర్మాణం ఉండాలన్న కాన్సెప్ట్తో జెట్సిటీకి ప్రణాళికలు ఉండటంతో.. కొండలను తొలచకూడదని గతంలో నిర్ణయించారు. కొండల మీద వాలు ప్రాంతాలను సృష్టించి అక్కడ పరిశ్రమల భవనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇళ్ళ నిర్మా ణానికి తక్షణం 100 ఎకరాల భూముల అవసరమని భావించటంతో రైతుల దగ్గర నుంచి సమీకరించాలని నిర్ణయించారు. వారితో అనేకమార్లు సంప్రదింపులు జరిపిన మీదట భూములను సేకరించాలని, ఎకరానికి రూ. కోటి చొప్పున పరిహారాన్ని చెల్లించటానికి అంగీకరించారు. అప్పట్లో ప్రభుత్వం కూడా అంగీకరించింది. రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవటానికి వారి పాస్బుక్లు, టైటిల్ డీడ్స్, తదితర డాక్యుమెంట్స్ , బ్యాంకు ఖాతాలను సేకరించారు. ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడాల్సి ఉండగా అది జరగలేదు. నూతన ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. జెట్సిటీ పనులకు సంబంధించి విజిలెన్స్ విచారణ జరగటం, పలు అవకతవకలు చోటు చేసుకున్నాయన్న నివేదిక వచ్చింది. కొండలను తవ్వి మట్టి అమ్ముకున్నారన్న ఆరోపణలను విజిలెన్స్ ప్రధానంగా ఎత్తి చూపింది. షేర్ వాల్ టెక్నాలజీ రూపంలో ఎక్కువ ఖర్చు చేశారన్న అంశాలను విజిలెన్స్ ఎత్తి చూపింది. దీంతో తాత్కాలికంగా ఇక్కడ పనులు స్థంబించాయి.
ప్రభుత్వ భూములపై దృష్టి : ఇదే సందర్భంలో జెట్సిటీ విస్తరణకు ప్రైవేటు భూములు కాకుండా ప్రభుత్వ భూములనే సేకరించటానికి రంగం సిద్ధం అవుతుండటంతో.. జెట్సిటీ కొనసాగుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. జెట్సిటీ కోసం గతంలో పట్టాభూములను కూడా అప్పగించారన్న కారణంగా కొంతమంది కోర్టుకు వెళ్ళటంతో ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతలను ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి అప్పగిచింది. ఆ దిశగా రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తోంది. జెట్సిటీని అనుకుని మరో 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ భూములను జెట్సిటీ విస్తరణ కోసం అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మూడు కొండల చుట్టూ కొంత మేర తొలగించగలిగితే ఎంతలేదన్నా 100 ఎకరాలను సేకరించ వచ్చునని తెలుస్తోంది.

Related Posts