డైలీ సీరియల్ ను తలపిస్తున్న మరాఠ రాజకీయాలు
ముంబై,
మహరాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భారతీయ జనతా పార్టీ శివసేన దిగివస్తుందేమోనన్న ఆలోచనతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేస్తోంది. శివసేన మాత్రం తమకు ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. దీర్ఘకాలం తర్వాత తమకు లభించిన అవకాశాన్ని శివసేన జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేదు.భారతీయ జనతా పార్టీ ఇప్పటికే గవర్నర్ ను కలసి తమకు ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా బలముందని చెప్పింది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ముందు తమకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ కోరుతోంది. సహజంగా గవర్నర్ బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు తొలుత ఆహ్వానిస్తారు. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ ఇప్పటికే బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆయన ఏమేరకు బలాన్ని నిరూపించుకుంటారన్నదే ప్రశ్న.బీజేపీ తమకు వచ్చిన 105 సీట్లతో పాటు మరో పదిహేను మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతోంది. అంటే మొత్తం 120 స్థానాలు. ఇది మ్యాజిక్ ఫిగర్ కు సరిపోదు. మ్యాజిక్ ఫిగర్ 144 సీట్లు. అయితే తమకు శివసేన ఎమ్మెల్యేలు 45 మంది వరకూ మద్దతు తెలుపుతున్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. శివసేన లాంటి పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ లైన్ మార్చుకుని వస్తారా? అన్నదే సందేహం. ఇది బీజేపీ మైండ్ గేమ్ అని అనుకోవడానికీ వీలులేదు. ఎందుకంటే శివసేనను మహారాష్ట్రలో బలహీన పరిస్తే తమకు కూడా ఇబ్బందులు తప్పవన్నది బీజేపీ నేతలకు తెలియంది కాదుమరోవైపు శివసేన బీజేపీకి వార్నింగ్ ల మీద వార్నింగ్ లు పంపుతోంది. శివసేన సయితం గవర్నర్ ను కలసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది శివసేన లక్ష్యం. బీజేపీతో అంత తెగదెంపులు చేసుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న శివసేన మంత్రులు ఇంతవరకూ ఎందుకు రాజీనామా చేయలేదు? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవ్వక మానదు. మొత్తం మీద శివసేన, బీజేపీలు మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెల్లడై పది రోజులు దాటుతున్నా ఇంకా స్పష్టత రాలేదు.