ఎల్వీ సుబ్రహ్మణ్యం తర్వాత ఎవరు...?
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్యణ్యాన్ని ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేయడంతో తదుపరి సీఎస్ ఎవరవుతారన్న చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ జాబితాలో పలువురు సీనియర్ అధికారుల పేర్లు వినిపిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ ఛాయిస్ ఎలా ఉత్కంఠ ఇప్పడు అందరిలో నెలకొంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న ఐఏఎస్ దంపతులు అజయ్ సహానీ, నీలం సహానీలతో పాటు, వారి కంటే ఒక ఏడాది సీనియర్ అయిన ప్రీతి సుడాన్, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరుల పేర్లు సీఎం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న వాతావరణాన్నిబట్టి చూస్తే నీలం సహానీకే సీఎస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు.ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ తన ఛాయిస్ ప్రకారం సీఎస్‌గా నియమించలేదు. గత ప్రభుత్వ హయాంలో అప్రాధాన్య పోస్టుల్లో పని చేసిన ఎల్వీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయంతో అనూహ్యంగా సీఎస్ అయ్యారు. అప్పట్లో జగన్‌కి అనుకూలంగా ఉన్న భాజపా తనపై కుట్ర చేస్తోందని భావించిన చంద్రబాబు… సీఎస్‌గా ఎల్వీ నియామకాన్ని అదే కోణంలో చూశారు. ఉక్రోషం పట్టలేని చంద్రబాబు జగన్ కేసుల్లో సహ నిందితుడిని సీఎస్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అప్పట్లో బాధించినా… మరో రకంగా ఆయనకు మేలే చేశాయి. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్… ఐఏఎస్ అధికారులను తనకు ఇష్టం వచ్చినట్టు బదిలీ చేశారు. సీఎస్‌ను మార్చుకునే అవకాశం ఆయనకు ఉన్నప్పటికీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వైపే మొగ్గు చూపారు.చంద్రబాబు ఎల్వీ సుబ్రహ్మణ్యంపై దండెత్తడం వల్ల కలిగిన సానుభూతి కూడా దీనికి ఒక కారణం కావొచ్చు. తన నిర్ణయాలకు ఎల్వీ సుబ్రహ్మణ్యం తలూపడం లేదని భావించిన జగన్ ఇక ఏ మాత్రం ఆయనను ఆ పోస్టులో కొనసాగించ కూడదని నిర్ణయించుకుని, బదిలీ చేశారు. ఇప్పడు ఆయన తనకు అనుకూలంగా ఉండే, తాను నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే అధికారి కోసం చూస్తున్నట్టు సమాచారం. తదుపరి సీఎస్ ఎవరన్నది జగన్ ముందే నిర్ణయించుకున్న తర్వాతే… ఎల్వీ సుబ్రహ్యణ్యాన్ని బదిలీ చేశారన్న వాదనా వినిపిస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన రోజే…. నీలం సహానీ వచ్చి జగన్ ను కలవడం చూస్తుంటే… తదుపరి సీఎస్ ఆమేనన్న విషయం రూఢీ అవుతోందని, ఆమె పేరు ప్రకటించడం లాంఛనమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.