భారంగా మారిన సైలేజ్ గడ్డి పంపీణి
గుంటూరు,
పశువులకు పౌష్టికాహారంగా గుర్తించిన సైలేజ్ ని పెద్దఎత్తున సబ్సిడీపై రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కిలో రెండు రూపాయలకు అందించాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 2015 నవంబర్ నుంచి ప్రారంభమైన సైలేజ్ గడ్డి పంపిణీ రానురాను పశుసంవర్ధక శాఖలో ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. అయితే ఆ శాఖలోని ఉన్నతాధికారుల అత్యుత్సాహం కిందిస్థాయి అధికారులకు శాపంగా పరిణమించింది. రాష్టవ్య్రాప్తంగా పశువులు, గొర్రెలు, మేకలు, తదితర పశువులకు సైలేజ్ గడ్డిని అందించే క్రమంలో 2016-17 సంవత్సరంలో 60వేల టన్నులను రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే రైతుల నుంచి 45వేల టన్నులకు మాత్రమే ఇండెంట్ వచ్చింది. 2017-18 సంవత్సరానికి లక్ష టన్నులను లక్ష్యంగా పెట్టుకోగా 73,526 టన్నుల గడ్డిని రైతులకు సరఫరా చేయగలిగారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 6లక్షల టన్నుల గడ్డిని రైతులకు సరఫరా చేయాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఇదంతా ఒక ఎత్తయితే తమ శాఖలో సాధిస్తున్న ప్రగతిపై వారంవారం ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వాకబు చేస్తుండటం మరో భారంగా మారింది. వారం రోజుల్లో సాధించే ప్రగతి ఏముంటుందన్నది కిందిస్థాయి ఉద్యోగుల ప్రశ్న. వీడియో కాన్ఫరెన్స్ అంటే పని మానుకుని వివరాలు సేకరించేందుకు ఒకరోజు మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని, దీంతో పనులు ముందుకు సాగడం లేదని అధికారులు వాపోతున్నారు. కొందరు ఉద్యోగులైతే పనిభారం, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల ఆదేశాలు తట్టుకోలేక సెలవులపై వెళుతున్న సంఘటనలూ లేకపోలేదు.జిల్లాలు, మండలాల వారీగా టార్గెట్లు పెట్టి ఈమేరకు ముఖ్యమంత్రికి నివేదిక అందించారు. కరవు ప్రభావిత ప్రాంతాలైన అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 90వేల టన్నుల చొప్పున, గుంటూరు జిల్లాకు 60వేల టన్నులు, మిగిలిన జిల్లాలకు 30వేల టన్నుల చొప్పున సైలేజ్ గడ్డిని రైతులకు విక్రయించాలని నిర్ణయించారు. దీంతో ఒక్కసారిగా లక్ష్యం ఆరు రెట్లు పెరగడంతో మండలస్థాయి పశువైద్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఓ పక్క పశువులకు రోజువారీ అందించాల్సిన వైద్యసేవలతో పాటు సైలేజ్ గడ్డి విక్రయాలు, ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, మెగా పశుగ్రాస క్షేత్రాలు, తాజాగా ప్రవేశపెట్టిన గోకులాలు, గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్ల నిర్మాణాలు, తదితర పనులతో కిందిస్థాయి అధికారులపై పనిభారం అమాంతం పెరిగిపోయింది. పథకాలు పెద్దఎత్తున ప్రవేశపెడుతున్నా అందుకు తగ్గ సిబ్బంది, అధికారుల నియామకాలు లేకపోవడం, కనీసం పదవీ విరమణ పొందిన వారి స్థానాలను భర్తీ చేయకపోవడంతో పనిభారంతో అధికారులు సతమతమౌతున్నారు. సైలేజ్ ఉత్పత్తి చేసే సంస్థలు సక్రమమైన నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో ఈ గడ్డిని కొనటానికి రైతులు విముఖత చూపుతున్నారు. సైలేజ్ నాణ్యతను పరిశీలించే వీబీఆర్‌ఐకు మేలురకం గడ్డిని పంపించి రైతులకు మాత్రం నాశిరకం గడ్డి సరఫరా చేస్తుండటంతో లక్ష్యాలు అధిగమించేందుకు పశువైద్యులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా సైలేజ్ తయారీలో ప్రధానంగా వాడే మొక్కజొన్న, జొన్న పంటలపై పెద్దఎత్తున కత్తెర పురుగు ఆశించడంతో దిగుబడులు అమాంతం పడిపోతున్నాయి. పంట లభ్యం కాకపోవడంతో తయారీ కుంటుపడుతోంది. దీంతో లక్ష్యసాధన పెద్ద సవాల్‌గా నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు నాటికి 6లక్షల టన్నుల లక్ష్యంలో కేవలం 1.20 లక్షల టన్నులు మాత్రమే రైతులకు సరఫరా చేయగలిగారు.