Highlights
- మన ఇతిహాసాలు
- పిడుగులు పడకుండా...
పాండవ మధ్యముడైన అర్జునుడికి మహాభారతంలో విశిష్టస్థానముంది. అర్జునుడికి అనేక పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు ఎలా వచ్చాయో వివరిస్తుంది మహాభారతంలోని విరాటపర్వం. విరాట మహారాజు కొలువులో పాండవులు, ద్రౌపదితో సహా అజ్ఞాతవాసం కొనసాగిస్తుంటారు. అర్జునుడు బృహన్నలగా రాజకుమారి ఉత్తరకు నాట్యశిక్షకుడిగా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. అయితే పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు తీసుకురావాలన్న దుష్టబుద్ధితో కౌరవులు విరాటరాజు రాజ్యంపై దాడి చేసి గోవులను తరలించుకుపోతారు. ఈ క్రమంలో కౌరవులను నిలువరించేందుకు రాజకుమారుడు ఉత్తర కుమారుడికి రథసారధిగా అర్జునుడు వ్యవహరిస్తాడు. అయితే భారీ కౌరవసేనను చూసిన ఉత్తరుడు యుద్ధక్షేత్రం నుంచి పారిపోతాడు. దీంతో అతనికి ధైర్యం చెప్పిశమీవృక్షంపై దాచివుంచిన ఆయుధాలను తీసుకురమ్మని చెబుతాడు. ఎండిపోయిన శవంలా ఆయుధాలు కనిపించడంతో భయపడిన ఉత్తరుడు కిందకు దిగివస్తాడు. అది శవం కాదని బృహన్నల ధైర్యం చెప్పడంతో తిరిగి చెట్టెక్కి ఆయుధాలను తీసుకువస్తాడు ఉత్తరుడు. తాను అర్జునుడినని బృహన్నల జరిగిన విషయమంతా ఉత్తరుడికి వెల్లడిస్తాడు. ఆ మాటలను నమ్మని ఉత్తరుడు అర్జునుడికి పలుపేర్లు ఉన్నాయని అవి ఎలావచ్చాయో చెప్పాలని కోరుతాడు.
అర్జునుడు తన పేర్ల వివరాలను ఇలా వివరించాడు. అర్జునుడు, ఫల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనుంజయుడు అనే పదిపేర్లను వెల్లడిస్తాడు. ఈ పేర్లు ఎలా వచ్చిందో కూడా సవివరంగా చెబుతాడు. నలుదిశల నుంచి ధనం తీసుకువచ్చి ఆ ధనం మధ్య ఉండటంతో ధనుంజయుడు అని, యుద్ధంలో ఎంతటి వీరుడినయినా ఓడించి విజయం సాధించడంతో విజయుడని, యుద్ధభూమిలో తెల్లని గుర్రాలను పూన్చిన రథాన్ని అధిరోహించడం వల్ల శ్వేతవాహనుడనే పేర్లు వచ్చాయన్నాడు. మహాకాంతివంతం, ఇంద్రుని చేత బహూకరింపబడిన కిరీటం ధరించడంతో కిరీటి అనే పేరు, యుద్ధ సమయాల్లో శత్రువులు గుండెలు దద్దరిల్లేలా బీభత్సంగా పోరాడటంతో బీభత్సుడు, యుద్ధంలో గాండీవం ధరించి రెండు చేతులతో బాణ ప్రయోగం చేయడంతో సవ్యసాచి అని, ధవళవర్ణం కలిగి రూపవంతంగా ఉండటంతో అర్జునుడు, పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి నక్షత్రాల సంధికాలంలో జన్మించడంతో ఫల్గుణుడు అని పేరు వచ్చిందన్నాడు. సోదరుడు ధర్మరాజు శరీరాన్ని ఎవరు గాయపరిచినా అలా చేసిన వారి వంశాన్ని నిర్మూలిస్తానని శపథం చేయడంతో జిష్ణుడు అన్న పేరు వచ్చిందని తెలిపాడు. తన తల్లి కుంతి అసలు పేరు పృథ అని ఆమెకు జన్మించడంతో పార్థుడు అన్న పేర్లు వచ్చాయన్నాడు. ఖాండవవన దహన సమయంలో దేవతలంతా ఆ కార్యాన్ని మెచ్చుకొని తనకు ప్రత్యక్షమైనప్పుడు వారందరికీ సాగిలపడి కృష్ణా అని పెద్దగా అనుకోకుండానే పిలిచానని ఆ కారణంగా దేవతలు తనను కృష్ణా అన్న పేరుతో పిలుస్తారన్నారు. ఇది తనకు పదకొండో పేరుగా ఉందన్నాడు. తన పేర్లను కీర్తించేవారికి మృగాల భయం, శత్రుపీడ ఉండవని ఉత్తర కుమారుడికి వివరించాడు.
పిడుగులు పడకుండా...
భారీ వర్ష సమయాల్లో పిడుగులు పడుతుంటాయి. ఈ సమయాల్లో అర్జునుడి పదినామాలను జపిస్తే ఆ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడవని పెద్దలు చెబుతారు. ఈ నామాలను పలికితే భయం పోయి ధైర్యం వస్తుందని కూడా తెలుస్తోంది.