YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆత్మహత్య కోసం వచ్చి..హత్య

ఆత్మహత్య కోసం వచ్చి..హత్య

ఆత్మహత్య కోసం వచ్చి..హత్య
హైద్రాబాద్, 
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ సజీవదహనం నేపథ్యంలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న నిజాలు సంచలనం రేపుతున్నాయి. బాచారం గ్రామంలో మొత్తం భూమిలో ఎక్కువ మంది బడాబాబులకే పట్టాలున్నాయని తెలుస్తోంది. ఆటో నడుపుకునే సురేష్‌.. స్థిరాస్తి వ్యాపారంలోకి అడుగుపెట్టి అప్పుల పాలయ్యాడనీ, అందుకే తన వాటా భూమి అమ్ముకునేందుకు యత్నించాడనీ తెలిసింది. ఈ నేపథ్యంలో పట్టా కోసం ఒత్తిడి పెంచి దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మొదట తాను ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని వచ్చిన నిందితుడు.. పథకం మార్చి ఆమెను సజీవదహనం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో బయటపడ్డ ఓ ఆడియో టేపులో రాజకీయ నేతల పేర్లు ప్రస్తావనకు రావడం కలకలం రేపుతున్నది.బాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని 73 నుంచి101 సర్వే నెంబర్‌లో ఉన్న 412 ఎకరాల భూమిలో బడా నాయకులకు సైతం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. బడానాయకులకు మాత్రమే పట్టాపాస్‌ పుస్తకాలు వచ్చాయనీ, చిన్నరైతులకు రాలేదనీ గ్రామస్తులు వాపోతున్నారు. కాంగ్రెస్‌ నాయకులు మల్‌రెడ్డి రంగారెడ్డికి 10 ఎకరాలు, జైపాల్‌రెడ్డికి నాలుగెకరాలు, విఠల్‌రెడ్డి ఐదెకరాలు, పాపిరెడ్డి ఆరెకరాలు, అంజయ్యగౌడ్‌కు 22 ఎకరాల భూములకు నూతన పాసు పుస్తకాలు వచ్చినట్టు స్థానికుల ద్వారా తెలిసింది. ఈ కేసు వివాదంలో ఉన్న 52 మంది రైతులకు మాత్రం పాసు పుస్తకాలు అందలేదు. పలు సందర్భాల్లో అధికారులను నిలదీసినా ఫలితం లేకుండా పోయింది.ఈ ఘటనలో తహసీల్దార్‌ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఓ ఆడియో టేప్‌ వెలుగులోకి వచ్చింది. ఆడియోలో రాజకీయ నేతల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఉన్నతాధికారులకు అలా జరగాల్సిందేనంటూ ఓ స్థానిక రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గౌరెల్లి భూముల వివాదంలో ఓ ఎమ్మెల్యే ప్రస్తావన తెచ్చాడు. పట్టాలు ఇప్పిస్తానంటూ సదురు ఎమ్మెల్యే రైతుల దగ్గర్నుంచి దాదాపు రూ.30లక్షల వరకు తీసుకున్నట్టు ఆడియోలో రికార్డయింది. అందులో సురేష్‌వి రూ.3లక్షల ఉంటాయని స్థానిక రైతు చెప్పాడు. కాగా గౌరెల్లి భూముల వివాదాల్లో తన ప్రమేయాన్ని సదరు ఎమ్మెల్యే కొట్టిపడేశారు. సురేష్‌ ఎవరో తనకు తెలియదనీ, రోజూ తనను కలవడానికి ఎంతోమంది వస్తుంటారనీ చెప్పారు. కోట్లు వస్తాయని ఆశపడ్డ నిందితుడు..బాచారం గ్రామంలో సర్వే నెంబర్‌ 92, 96లో సురేష్‌ కుటుంబానికి దాదాపు 8 ఎకరాల భూమి ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో ఎకరం దాదాపు రూ.3 నుంచి 4 కోట్ల విలువ చేస్తోంది. నిందితుడి వాటా కింద నాలుగు ఎకరాల భూమి వస్తుంది. అయితే హయత్‌నగర్‌ టూ గౌరెల్లికి సెవన్‌ సీటర్‌ ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తుండే సురేష్‌.. ఆర్నెల్ల క్రితమే స్థిరాస్తి వ్యాపారం దృష్టి పెట్టాడు. అప్పటికే కొన్ని అప్పులు చేయడం, ఓఆర్‌ఆర్‌ చుట్టూ భారీగా ధరలు పలకడంతో భూమి అమ్ముకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో పట్టా కోసం తన పెద్దనాన దుర్గయ్యతో చర్చించాడు. పాస్‌ పుస్తకం కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయితే తమకు బదులు కౌల్దార్ల పేర్లను చేర్చడంతో భూమి దక్కదని కక్ష పెంచుకున్నాడు. పక్కా పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం చేరుకున్నాడు. కిరోసిన్‌, పెట్రోల్‌ కలిపి రెండు లీటర్ల బాటిల్‌తో గదిలోకి వెళ్లాడు. విజయారెడ్డితో దాదాపు అరగంట పాటు మాట్లాడినా.. కోర్టులో వివాదం ఉన్నందున పట్టా ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటివరకు ఉన్న ఆలోచనను రెప్పపాటులోనే మార్చుకుని విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్‌ పోశాడు. వెంటనే తేరుకున్న తసీల్దార్‌ బయటకు వచ్చే ప్రయత్నంలో నిందితుడితో ప్రతిఘటించినట్టు తెలుస్తోంది. జుట్టుపట్టి లాగడంతో ఆమె కిందపడిన వెంటనే అగ్గిపెట్టేతో నిప్పంటించాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నిందితుడు కూర సురేశ్‌ నుంచి మేజిస్ట్రేట్‌ సమక్షంలో పోలీసులు వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు. పట్టా కోసం తాను చాలాకాలంగా తిరుగుతున్నాననీ, ఆమె నిరాకరించడంతో ఆగ్రహం చెందాననీ చెప్పాడు. ఆమెపై పెట్రోల్‌ పోసి, తానూ చనిపోవాలనే ఈ ఘటనకు పాల్పడ్డానని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సురేష్‌ పరిస్థితి విషమంగానే ఉందని ఉస్మానియా వైద్యులు వెల్లడించారు. 24 గంటలు దాటితే చర్మం కాలిపోయి సెప్టిక్‌ అయ్యే అవకాశముందని వెల్లడించారు. 74 గంటలు దాటితేగానీ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టంగా చెప్పలేమన్నారు. ప్రస్తుతం నిందితుడు న్యూరోబర్న్‌ షాక్‌లో ఉన్నాడని వైద్యులు తెలిపారు. సురేష్‌పై 302, 307, 333 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Related Posts