9 ఏళ్లు కలిసే ఉన్నాము :
హైద్రాబాద్,
ట్రెయినీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై అతడి భార్య భావన సంచలన ఆరోపణలు చేశారు. తొమ్మిదేళ్ల ప్రేమలో ఏనాడూ తన కులం పేరు ప్రస్తావించని మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు తక్కువ కులం దానివి అంటూ అవమానిస్తున్నాడని.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తన భర్తతో పాటు అతడి మిత్రుడు కూడా తనను వేధించినట్లు పేర్కొన్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ ట్రెయినీ ఐపీఎస్ కొక్కంటి వెంకట మహేశ్వర్ రెడ్డిపై అతడి భార్య బిందుల భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన అన్యాయం గురించి వెల్లడించారు.కడపకు చెందిన మహేశ్వర్ రెడ్డి, తాను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొంటున్న సమయంలో ప్రేమించుకున్నామని భావన తెలిపారు. 2009 నుంచి ప్రేమించుకున్న తాము 2018 ఫిబ్రవరిలో కీసర రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో వివాహం చేసుకున్నట్లు చెప్పారు. తన వివాహానికి కుటుంబ సభ్యులు కూడా వచ్చినట్లు వెల్లడించారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో మహేశ్వర్, తాను ఒకే చోట ఉన్నామని తెలిపారు.‘పెళ్లి గురించి ఇంట్లో వాళ్లకు చెప్పమంటే సెటిలయ్యాక చెప్తా అంటూ మహేశ్ దాటవేశాడు. తీరా ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత మోసం చేశాడు. ఎక్కువ కట్నం ఉన్న సంబంధం వస్తుందనే ఆశతో మొహం చాటేశాడు. నాది తక్కువ కులమని.. తన ఇంట్లో ఒప్పుకోరని చెబుతున్నాడు’ అని భావన ఆవేదన వ్యక్తం చేశారుమహేశ్వర్ రెడ్డి మిత్రుడు నాగేందర్ రెడ్డి కూడా తనను వేధించారని భావన చెప్పారు. తక్కువ కులం దానిని అంటూ వారిద్దరూ తనను మానసిక వేదనకు గురి చేశారని ఆరోపించారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు సరైన రీతిలో స్పందించడం లేదని తెలిపారు.డీజీపీ మహేందర్ రెడ్డిని సంప్రదిస్తే.. సీపీ మహేష్ భగవత్‌ను కలవమన్నారు. మహేష్ భగవత్ పట్టించుకోకపోగా.. మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ అని, అతడిని ఇబ్బంది పెట్టవద్దన్నట్లుగా చెప్పారు. కుషాయిగూడ ఏసీపీని కలిస్తే అవమానకరంగా మాట్లాడారు. దీంతో సోషల్ మీడియాలో బాధను వ్యక్తం చేశా. ఆ తర్వాత నామ మాత్రంగా కేసులు మాత్రం పెట్టారు’ అని భావన చెప్పుకొచ్చారు.కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ తనను చులకనగా చూశారని భావన ఆరోపించారు. ఏమైనా ఉంటే సెటిల్ చేసుకోవాలని చెప్పారని తెలిపారు. పోలీసుల నుంచి తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను కూడా కలిసినట్లు వెల్లడించారు. ‘నాకు నా భర్త కావాలి. కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..’ అని భావన తెలిపారు
.