కోటిన్నర సభ్యత్వంతో రజనీ పార్టీ
చెన్నై, )
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు. అది గ్యారంటీ. ఎప్పుడనేది క్లారిటీ ఉన్నప్పటికీ ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటన చేశారు. 2017 డిసెంబరు 31న రజనీకాంత్ ఈ ప్రకటన చేయడంతో ఆయన అభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. రాజకీయ పార్టీల్లో మాత్రం ఆందోళన మొదలయింది. రజనీకాంత్ చాలా స్పష్టతతో ఉన్నారు. 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే రజనీకాంత్ స్పష్టం చేశారు.అయితే పార్టీ పేరును ఇప్పటికీ ప్రకటించకపోయినప్పటికీ రజనీ మక్కల్ మండ్రంను స్థాపించారు. దీని ద్వారా సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఏడదిన్న క్రితమే ప్రారంభమయింది. దాదాపు కోటిన్నర సభ్యత్వం చేర్పించాలని, ప్రతి గ్రామంలో మక్కల్ మండ్రంను ఏర్పాటు చేయాలని రజనీకాంత్ నిర్ణయించారు. ఇప్పటికే రజనీకాంత్ అభిమాన సంఘాలు గ్రామ గ్రామాన తమిళనాడులో ఉన్నాయి. వాటినే మక్కల్ మండ్రంగా మార్చేశారు.ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండటంతో రజనీకాంత్ మరింత వేగం పెంచారంటున్నారు. తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకోవాలని రజనీకాంత్ భావించారు. ప్రశాంత్ కిషోర్ తో కూడా చర్చలు జరిపారు. అయితే ప్రశాంత్ కిషోర్ కు తమిళనాడులో పట్టులేదని భావించిన రజనీకాంత్ లోకల్ వ్యూహకర్త కోసం గాలించారు. ప్రస్తుతం ఆయన జాన్ ఆరోగ్య స్వామిని తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రశాంత్ కిషోర్ కన్నా తమిళనాడు రాజకీయాలు బాగా తెలిసిన జాన్ ఆరోగ్య స్వామి బెటర్ అని రజనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పైగా ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ కు సేవలను అందిస్తోంది. జాన్ ఆరోగ్య స్వామి పీఎంకే ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. తమిళనాడు రాజకీయాలపై పట్టున్న జాన్ ఆరోగ్యస్వామిని త్వరలోనే రజనీకాంత్ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంటారని తెలుస్తోంది. మొత్తం మీద రజనీకాంత్ త్వరలోనే పార్టీని ప్రకటించి క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారన్నది వాస్తవం.