ఆ నలుగురిలో ఒకరికి ఏపీసీసీ ఛీఫ్
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలంటే కొన్ని అర్హతలుండాలి. అవి ఉంటేనే ఆ పేరును పరిశీలిస్తారు. ఆ:ద్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ రెండు రోజుల పాటు విజయవాడలో కసరత్తు చేశారు. త్వరలోనే సరైన అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. అయితే ఇందుకు దిగువ స్థాయి నేతలతో సంబంధాలు కలిగి ఉండాలి. బలమైన సామాజిక వర్గం అండ సంపాదించ కలిగే సామర్థ్యం ఉండాలి. అధికార పార్టీని వ్యతిరేకించే సత్తా ఉండాలి. వీరికే ఆ పదవి ఇస్తారని ఉమెన్ చాందీ తేల్చి చెప్పినట్లు తెలిసింది.ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు గత కొద్ది రోజులుగా నాయకుడు లేరు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పూర్తిగా దూరమయింది. రాష్ట్రంలో రాజధాని మార్పు, ఇసుక కొరత వంటి అంశాలపై అన్నీ విపక్షాలు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ జాడ మాత్రం కన్పించడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఎంతగా అంటే కనీసం ఒక్క సీటు సాధించకపోవడం అటుంచితే… పోటీ చేసిన వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర విభజనే అని చెప్పనక్కర లేదు.ఇక ఆంధ్రప్రదేశ్ లో బలమైన కాంగ్రెస్ నేత ఎవరూ లేరు. ఇమేజ్, ఛరిష్మా ఉన్న నేతలు ఆ పార్టీలో లేరు. రాష్ట్ర విభజనతో ఇప్పటికే చాలామంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని ముందే గ్రహించి వెళ్లిపోయిన నేతలు ఇతర పార్టీల్లో మంచి పదవుల్లో ఉన్నారు. దీంతో మిగిలి ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ లో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమితో పీసీపీ చీఫ్ గా ఉన్న రఘువీరారెడ్డి సయితం పదవికి రాజీనామాచేసి వెళ్లిపోయారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పార్టీని, క్యాడర్ ను ఏపీలో బతికించుకోవడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం చర్యలు ప్రారంభించింది. ఉమెన్ చాందీ పార్టీలోని సీనియర్ నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. జిల్లాల ఇన్ ఛార్జిల మనోభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ పదవి కోసం పల్లంరాజు, చింతామోహన్, శైలజానాధ్, తులసీరెడ్డి వంటి సీనియర్ నేతల పేర్లు విన్పిస్తున్నాయి. వీరిలో ఒక్కరికి పదవి దక్కుతుందనుకున్నా పొరపడినట్లే. సామాజిక సమీకరణాల అధారంగా, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వారినే పీసీపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని సమాచారం. ఈ జాబితాలో ఉన్న ఒకరి పేరును సోనియాగాంధీ త్వరలో ఖరారు చేయనున్నారు.