YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఉగాది రుచులు.. 

Highlights

  • ఉగాది పచ్చడి...
  • మామిడికాయ పులిహోర..
  • మామిడికాయ సలాడ్‌...
  • భక్ష్యాలు...
  • పచ్చికొబ్బరి పూర్ణం బూరెలు..
ఉగాది రుచులు.. 

కొంచెం పుల్లపుల్లగా... వగరుగా... కాస్త కారంగా ఉన్న మిశ్రమాన్ని చూస్తే చాలు ఎంతటి వారికైనా సరే నోట్లో నీళ్లూరక తప్పదు. ఇక అలాంటి ఆరు రుచులు ఒకే రెసిపీలో ఉంటే దాన్నే ఉగాది పచ్చడి అంటారు. ఉగాది అనగానే ఉగాది పచ్చడితో పాటు వేడి వేడిగా నెయ్యిలో వేయించిన భక్ష్యాలు గుర్తుకురాక తప్పదు. అలాంటి రుచికరమైన స్వీట్‌ అండ్‌ హెల్ది వంటకాలను మనకు పరిచయం చేస్తున్నారు పి. లీలారాణి. అవేంటో తెలుసుకొని మీరు ఓ సారి ప్రయత్నించి చూడండి... 


ఉగాది పచ్చడి...
కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు-సగం కప్పు, వేప పువ్వు-సగం కప్పు, బెల్లం తురుము-సగం కప్పు, చింత పండు రసం-సగం కప్పు, ఉప్పు-తగినంత, కారం-తగినంత, గసగసాలు-ఒక చెంచా, అరటి పండు-ఒకటి. 
తయారీ విధానం: ముందుగా చింత పండు గుజ్జును తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ ను సన్నగా తురుము కోవాలి. ఇలా తయారు చేసుకున్న మామిడి తురుమును ఒక పాత్రలో తీసుకోవాలి. దాంట్లోనే ముందుగా తురుముకున్న బెల్లం, వేప పువ్వు, చింత పులుసు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, గసగసాలు, అరటి పండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఉగాది పచ్చడి రెడీ! ఇది కేవలం మామిడికాయలతో నే కాదు వివిధ రకాల పండ్లతో చేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది. 

మామిడికాయ పులిహోర...
కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము-ఒక కప్పు, అన్నం-ఒక కప్పు, పల్లీలు-సగం కప్పు, పచ్చిమిర్చి-రెండు, ఎండు మిర్చి-రెండు, జీలకర్ర - సగం చెంచా, ఆవాలు - సగం చెంచా, మినపప్పు -కొద్దిగా, కరివేపాకు-రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత, పసుపు-ఒక చెంచా, నూనె-సరిపడా. 
తయారీ విధానం: ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ మీద పాత్ర పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడి కాగానే దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, ఎండు మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ తురుము వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి. చివరగా ముందుగా తయారు చేసుకున్న అన్నం, ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ! 


మామిడికాయ సలాడ్‌...
కావాల్సిన పదార్థాలు: మామిడికాయ-ఒకటి, దోసకాయ-ఒకటి, క్యారెట్‌-ఒకటి, కొత్తిమీర-ఒకటి, పుదీనా-ఒకటి, ఉప్పు-రుచికి సరిపడా, కారం-కొద్దిగా, నిమ్మకాయ రసం-చిటికెడు, దాల్చిన చెక్క పొడి-కొద్దిగా, చాట్‌ మసాలా-ఒక చెంచా, మామిడి ఆకులు-డేకరెట్‌ చేసుకోవడానికి. 
తయారీ విధానం: మామిడికాయ ముక్కలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇలా కట్‌ చేసుకున్న ముక్కలను ఒక పాత్రలో వేసుకున్న తర్వాత అందులో దోసకాయ ముక్కలు, క్యారెట్‌, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడు నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరింత రుచిగా ఉండటానికి చిటికెడు దాల్చిన చెక్క పొడి, చాట్‌ మసాలా చల్లుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత బయటకు తీసి కాస్త మామిడి కాయ ఆకులతో డేకరేట్‌ చేసుకోవాలి. అంతే మామిడికాయ సలాడ్‌ రెడీ!


భక్ష్యాలు...
కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు - రెండు కప్పులు, బెల్లం- మూడు కప్పులు, గోధుమ పిండి - నాలుగు కప్పులు, చక్కెర- రెండు కప్పులు.
తయారీ విధానం: ముందుగా స్టవ్‌ మీద పాత్ర పెట్టి దాంట్లో బెల్లం వేసి కరిగించుకోవాలి. బెల్లం కరుగుతున్న సమయంలో ఉడికించుకున్న శనగపప్పు వేసి కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక చెంచా గసగసాలు, ఒక చెంచా సోంపు పొడి, యాలకుల పొడి, చిటికెడు శొంఠి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లబడే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లబడిన తర్వాత మెత్తగా గ్రైండ్‌ చేసుకుంటే భక్ష్యాల పూర్ణం రెడీ! ఆ తర్వాత మరో పాత్రలో గోధుమ పిండిని పూరీ పిండిలా కలిపి అరగంట నాననివ్వాలి. తర్వాత పూర్ణం ముద్దను చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి. గోధుమపిండి కొద్దిగా తీసుకుని దాంట్లో పూర్ణం నింపి చేత్తో మెల్లగా వత్తుకోవాలి. ( ఖాళీ ఆయిల్‌ ప్యాకెట్‌ కవర్‌పై వేస్తే ఈజీగా వస్తాయి) ఆ తర్వాత స్టవ్‌ మీద పాన్‌ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని భక్ష్యాలను దొరగా నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుంది. 


పచ్చికొబ్బరి పూర్ణం బూరెలు...
కావాల్సిన పదార్థాలు: పచ్చికొబ్బరి-ఒకటి, బెల్లం-ఒక కప్పు, బియ్యం పిండి-సగం కప్పు, మినప్పిండి-సగం కప్పు, యాలకులు - నాలుగు, జీడి పప్పు-కొద్దిగా, బాదం-కొద్దిగా, కిస్‌మిస్‌లు-కొద్దిగా, నూనె వేయించడానికి సరిపడా, నెయ్యి-ఒక కప్పు. 
తయారీ విధానం: ముందుగా బియ్యం పిండి, మినప్పిండి కలుపుకోవాలి. ఇది చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ మీద పాన్‌ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగాక దాంట్లో బాదం, జీడి పప్పు, పచ్చికొబ్బరి దోరగా వేయించుకోవాలి. స్టవ్‌ మీద మరో పాత్ర పెట్టుకొని దాంట్లో బెల్లం పాకం పట్టుకోవాలి. పాకం తయారయ్యేక దాంట్లో పచ్చికొబ్బరి తురుము, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బియ్యంపిండిలో ముంచి నూనెలో దోరగా వేసుకుంటే సరిపోతుంది. పూర్ణం బూరెలను పిల్లలు, పెద్దలూ చాలా ఇష్టంగా తింటారు.

Related Posts