ఆమ్ ఆద్మీకి ఊపిరొచ్చింది
న్యూఢిల్లీ,
పక్కలో బల్లెంలాంటి బీజేపీతో నిత్యం యుద్ధం చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి పెద్ద ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్ల్యేలపై అనర్హత వేయాలన్న పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తోసిపుచ్చారు. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు 2020 ఫిబ్రవరి 22న ముగుస్తోంది. ఎలాగూ త్వరలోనే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.ఇలాంటి సమయంలో 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా ఆప్‌కి పోయేదేమీ లేదు. కాకపోతే ఆ పిటిషన్‌ను రాష్ట్రపతి తోసిపుచ్చడం ఎన్నికలకు వెళ్లే ముందు కేజ్రీవాల్‌కి ఓ నైతిక బలం. దీంతోనే తనపై బీజేపీ కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని కేజ్రీవాల్ ప్రజలకు చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడింది. తనను పాలన చేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు కేజ్రీవాల్ బీజేపీ చేసే అవకాశం లభించింది. అందుకే ఆయన నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ట్వీట్ చేశారు. ఇంతకీ పిటిషన్ కథేంటంటే…ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు… ఆయా జిల్లాల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలకు కో ఛైర్మన్‌లుగాను ఉన్నారు. వారు లాభదాయక పదవులు చేపట్టారని, అది నిబంధనలకు విరుద్ధమని, వారిపై అనర్హత వేటు వేయాలని వివేక్ గర్గ్ అనే వ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆయన ఎలక్షన్ కమిషన్ అభిప్రాయం అడిగారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు… డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కో ఛైర్మన్ పదవుల్లో ఉన్నందుకు ఎలాంటి వేతనం, సిట్టింగ్ పీజు తీసుకోవడం గానీ, కారు, ఆఫీసు, సిబ్బంది, టెలిఫోన్, ఇల్లు వంటి సదుపాయాలేమీ పొందడం గానీ చేయడం లేదు కాబట్టి… అవి లాభదాయక పదవుల కిందకు రావని ఈసీ తేల్చేసింది. దాంతో రాష్ట్రపతి కోవింద్ కూడా ఆ పిటిషన్ కొట్టేశారు.