పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం
ఒంగోలు
తన సోదరుడు పొలం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ తనకు న్యాయం చేయాలని అన్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఒంగోలు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. పట్టణంలోని బోయపాలేనికి చెందిన చొప్పరపు రామయ్య, అతని సోదరుడు తిరుపతయ్యకు పొలం పంపకాల్లో చాలా రోజుల నుంచి వివాదం జరుగుతోంది. గతంలోనూ పొలం విషయంలో అన్నదమ్ములు ఇద్దరూ గొడవ పడి పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే పోలీసులు తనకు న్యాయం చేయకుండా తమ్ముడికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ రామయ్య పోలీస్ స్టేషన్ ఎదుట క్రిమిసంహారక ముందు తాగి కింద పడిపోయారు. ఇది గమనించిన పోలీసులు అతడిని హుటాహుటిన స్థానిక కమ్యూనిటీ వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రామయ్యపై ఎస్సై జి.శివన్నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు