తపాలాలో పంపించేందుకు ఏర్పాట్లు
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
చదువుల్లో అత్యున్నత డిగ్రీగా భావించేది పీహెచ్‌డీ. దీన్ని పొందాలని విద్యార్థులందరూ ఎంతో పట్టుదలతో చదువుతుంటారు. ఏ విభాగంలో చదివే విద్యార్థులైనా ఈ పట్టా పొందాలని కలలు కంటారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడి పరిశోధన చేస్తేనే ఈ పట్టా దక్కుతుంది. ఇంతటి గొప్ప పట్టాలను విశ్వవిద్యాలయాలు నిర్వహించే స్నాతకోత్సవ వేదికపై గవర్నర్ లేదా వీసీ చేతుల మీదుగా తీసుకోవాలని చాలా మంది కలలు కంటారు. ఇదొక అరుదైన, అద్భుతమైన అవకాశంగా అభ్యర్థులు భావిస్తారు. ఆ వేదికపై పీహెచ్‌డీ పట్టా తీసుకొనేందుకు కొందరైతే ఎన్నో ఏళ్ల పాటు వేచిచూస్తారు. ఇలాంటి వారి ఆశలపై జేఎన్‌టీయూహెచ్ తాజాగా తీసుకున్న నిర్ణయం నీళ్లు చల్లినట్లు అయింది. వేదికపై కేవలం బంగారు పతకాలను మాత్రమే ఇస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పీహెచ్‌డీ పట్టాలు అందుకోవాలని చూస్తున్న అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పీహెచ్‌డీలు పూర్తిచేసిన వారికి పట్టాలే ఇవ్వలేనప్పుడు రూ.లక్షలు వెచ్చించి స్నాతకోత్సవాన్ని నిర్వహించడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. పీహెచ్‌డీలు పూర్తి చేసిన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు విన్నవిస్తున్నారు.
బంగారు పతకాలతోనే సరి..
జేఎన్‌టీయూహెచ్ 5వ స్నాతకోత్సవాన్ని 2014లో నిర్వహించింది. 6వ స్నాతకోత్సవం ఏప్రిల్ 21, 2017న నిర్వహించింది. ఈ మధ్య సుమారు మూడేళ్లు సమయం గడిచిపోయింది. ఈ కాలంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారంతా.. పట్టాను వేదికపై తీసుకొనేందుకు ఆ మూడేళ్లు వేచి ఉన్నారు. 6వ స్నాతకోత్సవ వేదికపై సుమారు 600 మంది పట్టాలు తీసుకున్నారు. యూజీసీ నిబంధన ప్రకారం ఏటా స్నాతకోత్సవాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే జేఎన్‌టీయూ గత కొన్నేళ్లుగా స్నాతకోత్సవాలను ఏటా నిర్వహించట్లేదు. వీసీగా ఆచార్య ఎ.వేణుగోపాల్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇలాంటి కాలయాపన లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ఏటా విధిగా స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 2018 ఫిబ్రవరి లేదా మార్చిలో 7వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు వీసీ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య సన్నాహాలు ప్రారంభించారు. ఈ వేదికపై బంగారు పతకాలు మాత్రమే ఇస్తామని వర్సిటీ ఇటీవల జారీ చేసిన ప్రకటనలో వెల్లడించింది. పీహెచ్‌డీ పట్టాలన్నీ తపాలా ద్వారా పంపిస్తామని పేర్కొంది. దీని కోసం జేఎన్‌టీయూహెచ్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఇది చూసిన పీహెచ్‌డీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో ఏ వర్సిటీ కూడా ఇలా వ్యవహరించట్లేదని, తమకు పట్టాలు ఇవ్వడానికే సమయం లేదా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్షలు వెచ్చించినా..
జేఎన్‌టీయూహెచ్ స్నాతకోత్సవం నిర్వహించేందుకు 2017లో సుమారు రూ.15 లక్షల వరకు వెచ్చించింది. ఇప్పటివరకు ఆరు స్నాతకోత్సవాలు నిర్వహించింది. ఫిబ్రవరి లేదా మార్చిలో 7వ స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తోంది. 2018 జనవరి 31వ తేదీలోపు యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసినా లేదా చేయనున్న వారు స్నాతకోత్సవంలో పట్టాలు పొందేందుకు అర్హులని వర్సిటీ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు పట్టాలు పొందేందుకు ఈనెల జవవరి 20 నుంచి ఫిబ్రవరి 10వ తేదీలోపు వర్సిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బంగారు పతకాలు సాధించిన అభ్యర్థులకు స్నాతకోత్సవ వేదికపై పతకాలు ప్రదానం చేయనున్నారు. పీహెచ్‌డీ పట్టాలు తపాలా ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు జేఎన్‌టీయూ విద్యార్థులు ఒక్కొక్కరు ఏడాదికి రూ.30 వేల వరకు వెచ్చిస్తున్నారు. ఇలా పీహెచ్‌డీ పూర్తి అయ్యేవరకు రూ.లక్షల్లోనే ఖర్చు చేయాల్సి వస్తోంది. వర్సిటీలో పీహెచ్‌డీ సీటు దక్కడమే చాలా కష్టం. చాలా పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీటు దక్కిన తర్వాత ప్రతి అభ్యర్థి మూడు పుస్తకాలను రూపొందించాల్సి ఉంటుంది.