ప్రజలతో మమేకం.. పరిష్కారాలు అనేకం..
విజయనగరం,
తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధికారుల చుట్టూ, వారి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులనే ప్రజల వద్దకు తీసుకెళ్లి వారితో ముఖాముఖి సమావేశాలను నిర్వహిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పనితీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. విజయనగరం జిల్లాలోని కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన కురుపాం నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం తదితర మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉండగా మారుమూలన ఉన్న గిరిజన గ్రామాలకు అధికారులు ఎప్పుడోగానీ వెళ్లని పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగానే గిరిజన ప్రాంతాల్లో కొన్ని చిన్న సమస్యల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోంది. అలాగే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లో వార్తాపత్రికలు చదివి, టీవీల్లో వార్తలు చూసి సమాచారం తెలుసుకొనే అవకాశాలు తక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పథకాలు, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా పూర్తిగా తెలియక అర్హత కలిగిన పేదలు కూడా నష్టపోయే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరగనవసరం లేకుండా అధికారులనే ప్రజల వద్దకు తీసుకెళ్లి అటు ప్రజలకూ, ఇటు అధికారులకూ మధ్య సంధానకర్తగా తాను వ్యవహరించే ‘‘ప్రజలతో ముఖాముఖి’’ కార్యక్రమానికి పుష్ప శ్రీవాణి రూపకల్పన చేసారు. ఒక మండలంలో రెండు పంచాయితీ కేంద్రాలను ఎంపిక చేసుకొని ఒక కేంద్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, మరో కేంద్రంలో భోజనవిరామానంతరం నుంచి సాయంత్రం దాకా ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా కురుపాం నియోజకవర్గంలో మారుమూలనున్న గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పుష్ప శ్రీవాణితో పాటుగా ఆయా మండలాలకు చెందిన ఎంఆర్ఓలు, ఎంపిడీఓలు, ఎంఇఓలు, మండల వైద్యాధికారులు, పోలీసు. ఎక్సైజ్ శాఖల అధికారులు, సిడిపిఓలు, పంచాయితీరాజ్, మైనర్ ఇరిగేషన్, ఆర్ఢబ్ల్యుఎస్, ఆర్అండ్ బి, హౌసింగ్ తదితర శాఖలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులు, ఐటీడీఏ అధికార సిబ్బంది, కొత్తగా వచ్చిన వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మండలంలోని కేదారిపురం, పెద్దఖర్జ పంచాయితీ కేంద్రాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేదారిపురం, వంగర, సెంటర్ గూడ, జోబుగూడ, పెద్దఖర్జ, బొద్దిది, గారటి, చొప్పగూడ, తోలుఖర్జ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఆ తర్వాత కురుపాం మండలానికి చెందిన ధర్మలక్ష్మీపురం, జి.సివడ పంచాయితీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ధర్మలక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో శాలిడంగూడ, నీలకంఠాపురం, జరడ, బొడ్డుమానుగూడ, భీమిపురం, ఊసకొండ, పిటిమండ, దండుసూర గ్రామస్తులు తమ సమస్యలను చెప్పుకోగా జి.సివడలో నిర్వహించిన కార్యక్రమంలో నిమ్మలత్రివేణి, మడ్డుగూడ,గుజ్జువాయి, డి.బారామని, ఆదమ్మ, దేరింగుపాడు,గాజువాయి, ఎగువ కొత్తగూడ, నెండ్రగూడ, ఇప్పమానుగూడ, తవుడుగూడ, పెద్దగొత్తిలి, బబ్బంగి, నాగరకుంటుబాయి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు.