ఫలించని ఎదురు చూపులు (మెదక్)
మెదక్, సింగూరు జలాశయంలోకి నీళ్లొస్తాయని అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా ఆ ఆశ తీరడం లేదు. మెదక్, సంగారెడ్డి ప్రజల దాహార్తి తీరాలంటే ఈ ప్రాజెక్టులోకి సమృద్ధిగా జలాలు రావడమే ఏకైక మార్గం. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అక్టోబరు ముగిసినా కేవలం 1.18టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. రానున్న రోజుల్లో తలెత్తే నీటి కొరతను తలచుకుంటే ఈ రెండు జిల్లాల వాసులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంది. గత వేసవి కంటే వచ్చే ఎండాకాలంలో మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. దీంతో తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఏం చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే కోణంలో సమాలోచనలు జరుపుతున్నారు. పురపాలికలు మొదలు పల్లెల్లోనూ బోరుబావులు అద్దెకు తీసుకోవడంతో పాటు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంపైనా దృష్టి సారిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టులో నిండానీళ్లున్నాయి. వీటిని పైపుల ద్వారా తరలించి సింగూరు వరకు తేవాలనేది ఒక ఆలోచన. అక్కడ శుద్ధి చేసి నల్లాల ద్వారా అందిస్తే కొంత ఉపశమనం దక్కుతుందని భావించారు. రెండు రోజులకోసారి ప్రతి వ్యక్తికి 20లీటర్ల చొప్పున నీళ్లు అందించాలన్నా రూ.190 కోట్ల వరకు ఖర్చవుతుందనేది అంచనా. 58 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయడానికి దాదాపు ఆరునెలల పాటు పనులు చేయాల్సి ఉంటుంది. ఇంత చేసినా ఏ మేరకు ఉపయోగం ఉంటుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అధికారులు ఈ ప్రతిపాదనను సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చేట్లు లేదు. వ్యయం ఎక్కువ కావడం, ఆశించిన ప్రయోజనం సకాలంలో దక్కకపోయే అవకాశాలుండటమే ఇందుకు కారణం. సంగారెడ్డి జిల్లాలోని బాహ్యవలయ రహదారి లోపలి గ్రామాలకు జలమండలి నుంచి నీరు సరఫరా అవుతుంది. మిగతా అన్ని గ్రామాలకు సింగూరే ఆధారం. సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు-జోగిపేట పురపాలికల్లో నల్లాల ద్వారా నీళ్లు అందిస్తున్నామని మిషన్ భగీరథ పథకం అధికారులు వివరిస్తున్నారు. మూడు రోజులకోసారి అరకొరగా సరఫరా అవుతున్నాయి. ఈ నీటినీ తాగే పరిస్థితి లేదని పలు కాలనీల వాసులు చెబుతున్నారు. జిల్లాలోని అయిదు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు వచ్చే వేసవి ముగిసే వరకు తాగునీటిని అందించడం అధికారులకు సవాల్గా మారనుంది. సంగారెడ్డిలో వర్షాలూ అంతంతమాత్రంగానే పడటంతో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. గత రెండు రోజులుగా ప్రత్యామ్నాయ చర్యల దిశగా అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో 959 నివాస ప్రాంతాలున్నాయి. వీటిలో తూప్రాన్, చేగుంట, మనోహరాబాద్, నార్సింగి మండలాల్లోని 109 ప్రాంతాలకు గజ్వేల్ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోందని అధికారులు చెబుతున్నారు. మిగతా వాటికి అద్దె బోర్లు, ట్యాంకర్లే ఆధారం. గత రెండు నెలల్లో వానలు బాగానే పడటంతో భూగర్భజలాలూ కొంత మేర పైకొచ్చాయి. బోర్లు అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలంటే ప్రతినెలా రూ.1.50 కోట్ల వరకు వ్యయమవుతోంది. ఈ ఏడాది జులై నుంచి సింగూరు ద్వారా నీళ్లు అందకపోవడంతో ఈ మేరకు ఖర్చుచేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ దీనినే కొనసాగించనున్నారు.