మాయమైపోయింది (అనంతపురం)
అనంతపురం, : నగరంలో వర్షాలు కురిసినప్పుడు నడిమి వంక ద్వారా వచ్చే వరద నీటిని శింగనమల చెరువుకు తీసుకెళ్లాల్సిన తడకలేరు రెండు మూడు మీటర్ల వెడల్పునకు కుదించుకుపోయింది. ఇది ఒకప్పుడు 150 మీటర్ల వెడల్పుతో ఉండేది. దీనికి ఇరువైపులా ఆక్రమించేసి పంటలు సాగుచేస్తున్నారు. మరోవైపు నిర్మాణాలు చేపట్టారు. కళ్లెదుటే ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అనంత నగర పరిధిలో భూమి ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు ప్రభుత్వ స్థలాల్ని దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఆఖరికి మురుగు కాలువలు, వంకలను వదలడం లేదు. ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ జెండా పాతేస్తున్నారు. నగరంలోని వంకల్లో నడిమి వంక ప్రధానమైనది. అనంతలో కురిసే వర్షపు నీరంతా వంకలోకే వచ్చి చేరుతుంది. ఇక భారీ వర్షాలు కురిస్తేనే ఉగ్రరూపం దాలుస్తుంది. ప్రసుత్తం వంక పూర్తిగా ఆక్రమణలకు గురైంది. గతంలో దాదాపు 40 మీటర్ల వెడల్పుతో పారేది. ప్రస్తుతం కొన్నిచోట్ల సగానికి పైగా కబ్జాకు గురైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. నగర శివారు సోమలదొడ్డి ప్రాంతంలోని ఇస్కాన్ ఆలయం సమీపంలో నడిమివంక తడకలేరులో కలుస్తుంది. నడిమివంక నుంచి తడకలేరు ద్వారా వర్షపు నీరంతా శింగనమల చెరువులోకి వెళ్తుంది. అనంతపురం నుంచి గుత్తి వెళ్లే దారిలో సోమలదొడ్డి సమీపంలో రహదారిపై లోలెవల్ బ్రిడ్జి నిర్మించారు. ఇది దాదాపు 150 మీటర్ల వెడల్పులో ఉంటుంది. దానిలో కనీసం 90 శాతం వెడల్పుతో వంక ఉండాలి. కానీ అక్కడ తడకలేరు చిన్న కాలువలా కనిపిస్తుంది. ఓవైపు వరి పొలాలు.. మరోవైపు తాత్కాలిక నిర్మాణాలు దర్శనమిస్తాయి. తడకలేరు ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోయాయి. కొందరు కబ్జా చేసి, స్థలం చుట్టూ నాపరాయి బండలు పాతారు. వాటిని శాశ్వత కట్టడాలుగా మార్చేందుకు యత్నిస్తున్నారు. గతంలో నడిమివంక, తడకలేరులో వరద నీరు బాగానే పారేది. రానురాను 95 శాతం వంక స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. అవి చిన్న కాలువలా మారిపోయాయి. దాదాపు 95 శాతం ఆక్రమణలకు గురైంది. ఆక్రమణలన్నీ నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. నగరంలో ఏ చిన్నపాటి వర్షం కురిసినా నీరు బయటకు వెళ్లడానికి చాలా సమయం తీసుకుంటోంది. ఇక భారీ వర్షాలైతే కాలనీలు జలమయమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలాలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.