YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఆర్డీఏ పరిధిలో అక్రమ లే ఔట్లు ముందుకు పడని అమరావతి ఎక్స్ ప్రెస్ వే

సీఆర్డీఏ పరిధిలో అక్రమ లే ఔట్లు ముందుకు పడని అమరావతి ఎక్స్ ప్రెస్ వే

సీఆర్డీఏ పరిధిలో అక్రమ లే ఔట్లు
ముందుకు పడని అమరావతి ఎక్స్ ప్రెస్ వే
గుంటూరు,
గుంటూరు జిల్లాలో సిఆర్‌డిఎ పరిధిలో లేని 29 మండలాల్లో అక్రమ లే అవుట్‌లు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. భూసేకరణ పెద్ద సమస్యగా మారింది. చిలకలూరిపేటలో బైపాస్‌ రోడ్డు నిర్మాణం, రాజధాని అవుటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో పలు ప్రాజెక్టులు ఇంకా కార్యరూపం దాల్చలేదు. కాగితాలకే పరిమితం అయ్యాయి. అయితే రాజధాని ప్రాంతంలో ఉన్న ధరలతో సమానంగానే సిఆర్‌డిఎ పరిధిలో లేని 29 మండలాల్లో కూడా అదే రీతిలో భూములకు ధరలు పెంచి విక్రయిస్తున్నారుపొలాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ప్లాట్లు వేస్తున్నారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే చేరువలోనే వస్తుందని పలువురు రియల్టర్లు ప్రజలను నమ్మిస్తున్నారు. జిల్లాలోనే రాజధాని ఉన్న నేపధ్యంలో వివిధ నిర్మాణాలు, ప్రాజెక్టులు వస్తాయన్న ప్రచారం ఉంది. ఇవి కార్యరూపం దాల్చే సరికి కనీసం దశాబ్ధకాలం పైగా పట్టే అవకాశం ఉంది. గత నాలుగేళ్లల్లో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే ఆరు లైన్ల రహదారి ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రేపల్లె, బాపట్ల, వినుకొండ, మాచర్ల, గురజాల, నర్సరావుపేట నియోజకవర్గాల పరిధిలోని మండలాలు సిఆర్‌డిఎ పరిధిలో లేవు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో యడ్లపాడు మండలం మాత్రమే సిఆర్‌డిఎ పరిధిలో ఉంది. సిఆర్‌డిఏలో లేని 29 మండలాల్లో గ్రామ కార్యదర్శులే కీలక భూమిక పోషిస్తున్నారు. రాజకీయ వత్తిడి నేపధ్యంలో వీరు లేఅవుట్‌లకు అనుమతి ఇస్తున్నారు. నాన్‌ లేఅవుట్‌లు కూడా పెరుగుతున్నాయి. దీని వల్ల పంచాయతీలకు నష్టం జరుగుతుంది. పొలాలను స్థలాలుగా మార్చిన సందర్భంలో పన్నులు చెల్లించాలి. భూ మార్పిడికి అనుమతి పొందాలి. ఇందుకు పంచాయతీల తీర్మానం అవసరం. ఆ తరువాత జిల్లా అధికారులు, చివరికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందాలి. కానీ ఎవరి అనుమతి లేకుండా అక్రమ లేఅవుట్‌లు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. దరఖాస్తు నెంబరును అనుమతి నెంబరుగా కూడా చూపిస్తున్నారు. ఆయా పట్టణాల పరిధిలో లే అవుట్‌లు వేస్తే సంబంధిత మునిసిపల్‌ అధికారులు జిల్లాలోని అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ అధికారులకు ప్రతిపాదనలు పంపాలి. కానీ ఇక్కడ వరకూ ప్రతిపాదనలు రావడం లేదు. పట్టణ పరిధిలో కాకుండా మునిసిపల్‌ ప్రాంతానికి రెండు కిలో మీటర్ల దూరంగా లే అవుట్‌లు వేస్తున్నారు. ఈవిషయంలో గ్రామ కార్యదర్శుల పాత్ర కీలకంగా ఉంటోంది. ఇష్టారాజ్యంగా అనుమతి ఇచ్చిన నేపధ్యంలో జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్న వీరయ్య చౌదరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా ఎసిబి అధికారులు దాడి చేసి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కేసు నమోదు చేశారు. ఒక పొలంను ప్లాట్లుగా మార్చితే కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. రోడ్లు, డ్రైయిన్లు, కమ్యూనిటీ హాలు నిర్మాణం తదితర సదుపాయలు చూపాలి. నిబంధనల ప్రకారం 40 అడుగుల రోడ్లు చూపాలి. కానీ వీటి గురించి పట్టించుకోకుండా లే అవుట్‌లు ఆవిర్బవిస్తున్నాయి. కార్యదర్శలు తమ వ్యక్తిగత ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తూ పంచాయతీ ఆదాయానికి గండిగొడ్తున్నారు. కొంత మంది అక్రమ నిర్మాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వీటిలో రాజకీయ నాయకుల వత్తిడి కూడా అధికంగా ఉండటంతో జిల్లా అధికారులు కూడా కొన్ని చోట్ల జోక్యం చేసుకుని అనుమతి ఇప్పిస్తున్నారు. వీటిపై రెవెన్యూ యంత్రాంగం కూడా నియంత్రణ పెట్టాల్సి ఉంది. అయితే రెవెన్యూ యంత్రాంగం కూడా వీరితో అవగాహనతో వ్యవహరించడం వల్ల చాలా ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్‌లు ఆవిర్భవిస్తున్నాయి. ప్రస్తుతం ప్లాట్లు వ్యాపారం మందగమనంగా ఉన్నా వచ్చే జనవరి తరువాత ఊపందుకుంటుందని ధరలు పెరుగుతాయని వ్యాపారులు నమ్మిస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన వారు ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో తమకు ఆశించిన ధరలు ఎప్పటికి వస్తాయో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

Related Posts