నిరాశలో పార్థసారధి
విజయవాడ,
ఏపీలో రాజకీయాలు ఊహలకు అందడం లేదు. వాస్తవానికి అధికార పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జేజేలు పలుకుతారు. పనులు పూర్తవుతాయని, నిధులు విడుదల అవుతాయని కూడా ప్రజలు, నేతలు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ గెలుపు గుర్రం ఎక్కని నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆ పార్టీకే మొగ్గు చూపుతారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించి, భారీ ఎత్తున సీట్లు కైవ సం చేసుకున్న వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? పట్టుబట్టి గెలుచుకున్న నియోజకవర్గాల్లో పార్టీ హవా ఏ రేంజ్‌లో ఉంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
వైసీపీలో చేరి….కృష్ణా జిల్లాలోని కీలకమైన పెనమలూరు నియోజకవర్గంలో పట్టుబట్టి.. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విజయం సాధించారు. ఈయన గతంలో అంటే 2009లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఎదిగిన ఆయన పట్టు సాధించారు. ఈ క్రమంలోనే మంత్రి పదవిని సైతం నిర్వహించారు. అయితే, రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ఆయన పార్టీ మారిపోయి.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లోనే ఆయన పెనమలూరు నుంచి మరోసారి పోటీ చేసి విజయం సాధించాలని అనుకున్నారు.అయితే, అప్పట్లో మచిలీపట్నం ఎంపీ సీటుకు సరైన అభ్యర్థి లేక పోవడంతో జగన్ కొలుసు పార్థసారథిని అక్కడకు పంపారు. దీంతో అప్పట్లో ఆయన ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక, ఆ తర్వాత జగన్‌ను ఇంప్రెస్ చేసి తన సొంత నియోజకవర్గంలో పాగా వేశారు. ఇక, అదే ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ విజయం సాధించారు. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు కావడంతో ప్రజలకు తొందరగానే కనెక్ట్ అయ్యారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా బాగానే చేశారు.ఈ ఎన్నికలకు ముందు ఇక్కడ నుంచి లోకేష్ పేరు కూడా వినిపించింది. టీడీపీకి బలమైన కమ్మ వర్గం ఓటర్లు 55 వేల వరకు ఉండడంతో పాటు బీసీల ఓటు బ్యాంకు కూడా ఎక్కువుగా ఉండడంతో ఇక్కడ లోకేష్‌ను పోటీ చేయించాలన్న ఆలోచన కూడా వచ్చింది. చివరకు బోడే మరోసారి పోటీ చేయగా వైసీపీ గాలుల నేపథ్యంలో టీడీపీ కంచుకోటలో ఆయనపై పార్థసారథి 10 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బోడే ఓడినా ఆయన నియోజకవర్గంపై పట్టును వదులు కోలేదు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.ఇక, కొలుసు పార్థసారధి మాత్రం తనకు జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి వస్తుందని ఆశించినా.. రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురై.. ప్రజలకు దూరమయ్యారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు మంత్రి పదవి లేకపోవడంతో గతంలోలా దూకుడుగా ఉండడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ నిర్లిప్తతో ఉంటున్నారని టాక్. ఇప్పటి వరకు ఆయన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించింది లేదు. మరోపక్క, బోడే మాత్రం నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అధినేత చంద్రబాబు చెప్పినట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో కొలుసు పార్థసారథి కన్నా బోడే దూకుడు పెరిగిందని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఇక్కడ పెద్దగా పట్టు సంపాదించలేకపోతోందనే చర్చ వినిపిస్తోంది. మరి పార్థసారథి గెలిచి ఐదారు నెలలే కావడంతో ఇకపై అయిన పట్టు సాధిస్తారేమో ? చూడాలి.