YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కర్తార్ పూర్ శాంతితో సత్సంబంధాలు..?

కర్తార్ పూర్ శాంతితో సత్సంబంధాలు..?

కర్తార్ పూర్ శాంతితో సత్సంబంధాలు..?
న్యూల్లీ, 
భారత్ – పాకిస్థాన్ సంబంధాలు ఎప్పుడూ ఉప్పూ…నిప్పే. రెండు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. 370 అధికరణం రద్దు , నియంత్రణ రేఖ వద్ద తరచూ కాల్పుల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా రెండు దేశాల మధ్య ఇప్పుడు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అధికారికంగా కనీసం దౌత్య మర్యాదలను కూడా పాటించే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా “కర్తార్ పూర్” కారిడార్ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. ఈ అంశం ఉభయ దేశాల సంబంధాల్లో కారు చీకట్లో కాంతిరేఖలా మారింది. దేశాధినేతలు, మంత్రులు, ఉన్నతాధికారులను పక్కన పెడితే కనీసం ఉభయ దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలకు మార్గం సుగమమయింది.“కర్తార్ పూర్” కారిడార్ కు సంబంధించి చరిత్రలోకి వెళితే అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతాయి. భారత్ – పాకిస్థాన్ ల విభజనకు పూర్వం ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో కర్తార్ పూర్ ఉండేది. దేశ విభజనతో కర్తార్ పూర్ పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లింది. పాక్ లోని నరోవాల్ జిల్లాలో కర్తార్ పూర్ దర్బారా సాహిబ్ విస్తరించి ఉంది. ఇది సిక్కుల పరమ పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది. సిక్కుల తొలి గురువు గురునానక్ జీవిత చరమాంకంలో చివరి 18 సంవత్సరాలు ఇక్కడ నివసించారని ప్రతీతి. దీంతో కర్తార్ పూర్ దర్బారా సాహిబ్ సిక్కుల ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచింది.పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో గల కర్తార్ పూర్ దర్బారా సాహిబ్ కు, భారత్ అధీనంలోని పంజాబ్ రాష్ట్రంలో గల డేరా బాబా నానక్ గురుద్వారాల మధ్య కారిడార్ ను నిర్మించారు. ఇందులో భాగంగా ఉభయ దేశాల మధ్య గల రావి నదిపై వంతెన నిర్మించారు. ఉభయ దేశాలు తమ తమ సరిహద్దుల వైపు సొంత ఖర్చుతో కారిడార్ ను నిర్మించారు. నవంబరు 12న గురునానక్ దేవ్ 550 జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన పాక్ వైపున కారిడార్ ను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభిస్తారు. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మహ్మద్ ఫైజల్, భారత్ హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్పీసీ దాస్ ఉభయ దేశాల సరిహద్దు అయిన జీరో పాయింట్ వద్ద సంతకాలు చేశారు.ఒప్పందం ప్రకారం ఎటువంటి వీసా లేకుండా ఎవరైనా కర్తార్ పూర్ సందర్శించవచ్చు. పాస్ పోర్టుతోనే ప్రవేశించవచ్చు. సిక్కులతో పాటు అన్యమతస్థులు సయితం కర్తార్ పూర్ ను సందర్శించవచ్చు. గరిష్టంగా 11 వేల నగదు, ఏడు కిలోల బరువున్న సరుకులను తీసుకెళ్లే వీలుంది. రెండు గురుద్వారాల మధ్య సుమారు అయిదు కిలో మీటర్ల దూరం ఉంటుంది. కారిడార్ అన్ని వేళలా తెరిచే ఉంటుంది. ప్రతిరోజూ ఐదు వేల మంది భారతీయ యాత్రికులు కర్తార్ పూర్ వెళ్లి రావచ్చు. ఇందుకు గాను ప్రతి యాత్రికుడి వద్ద 20 డాలర్లు వసూలు చేస్తారు. యాత్రికులు ముందుగానే తమ పేరు నమోదు చేసుకోవాలి. యాత్రికులు ఉదయం వెళ్లి సాయంత్రం లోగా ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రావాలి. రాత్రిపూట పాకిస్థాన్ లో ఉండటానికి వీలులేదు. అంతేకాకుండా పాకిస్థాన్ లోని ఇతర గురుద్వారాలను సందర్శించడానికి అనుమతించరు. యాత్రికుల నుంచి రూ.1400 లు వసూలు చేయాలన్న పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. మత విషయాల్లో డబ్బు ప్రస్తావన ఉండరాదని వాదించింది. అయితే సిక్కు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వెనక్కు తగ్గింది.ఒప్పందానికి ముందు సిక్కు యాత్రికులు కర్తార్ పూర్ సందర్భించాలన్న తమ చిరకాల వాంఛ నెరవేరదన్న నిరాశతో ఉండేవారు. తాజా ఒప్పందంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ సిక్కులు ఉభయ దేశాల సరిహద్దు అయిన నియంత్రణ రేఖ వద్దకు వచ్చి బైనాక్యులర్స్ తో అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్తార్ పూర్ దర్బారా సాహిబ్ ను వీక్షించేవారు. తాజా ఒప్పందం ద్వారా ఖలిస్తాన్ వేర్పాటు వాదులను పాకిస్థాన్ ప్రోత్సహించగలదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఖలిస్థాన్ ఉద్యమానికి పాక్ దన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ నిఘావర్గాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Related Posts