అబ్దుల్లాపూర్ మెట్ స్థల వివాదంల పెద్ద తలకాయలు
హైద్రాబాద్,
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బాచారం భూముల వివాదం రోజురోజుకూ చర్చనీయాంశమవుతోంది. వేర్వేరు సర్వే నెంబర్లలోని భూములు కొందరు బడా నేతలకు పట్టాలుకాగా.. ఏండ్లుగా తిరుగుతున్న రైతులకు మాత్రం చుక్కెదురవుతూనే ఉంది. అయితే రెవెన్యూ అధికారుల సహకారంతో కొందరు రాజకీయ నేతలు తమ పలుబడిని ఉపయోగించి పట్టా చేసుకున్నట్టు తెలుస్తోంది. పైగా బడా నేతల ప్రోత్సాహంతోనే కొందరు కోర్టులో కేసులు వేసినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకుని సర్వే నెం. 72 నుంచి 101లో 412.13గుంటల భూములున్నాయి. 200 ఏండ్ల నుంచి అదే మండలానికి చెందిన గౌరెల్లి గ్రామస్థులు నిజాం కాలం నుంచి పట్టాదారుడైన రాజాఆనందరావు వద్ద కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇదే క్రమంలో కౌలు రైతులకు సాదాబైనామా కింద రాజా ఆనందరావు గౌరెల్లి గ్రామానికి చెందిన 52 కుటుంబాలకు విక్రయించారు. ఈ భూమిని సయ్యాద్ యాసీఫ్‌కు కూడా రాజాఆనంద రావు అమ్మాడు. సయ్యాద్ యాసీఫ్ 412 ఎకరాలు భూమిని రాజా ఆనందరావు వద్ద కొనుగోలు చేసినప్పటికీ ఈ భూములను సాగు చేసింది లేదు. తర్వాత యాసీఫ్ నుంచి గండి సిద్ధమ్మ కొనుగోలు చేసిం ది. ఈమె సైతం భూమ్మీదికొచ్చిన దాఖల్లేవు. దీంతో 52మంది రైతు కుటుంబాలు సాగుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 1998లో రాజా ఆనందరావు వద్ద కొనుగోలు చేసిన సాదాబైనామా ఆధారంగా రైతులకు అప్పటి తహసీల్దార్ సిరావుద్దీన్ పట్టాలిచ్చారు. 2004లో ఇదే భూము లపై అబీబ్, షఫిక్ అనే ఇద్దరు వ్యక్తులు కౌలు చట్టం ప్రకారం కోర్టులో కేసేశారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా కేసు పెండింగ్‌లోనే ఉంది. అయితే అబీబ్, షఫిక్‌లకు ఈ భూమితో ఎలాంటి సంబంధంలేదనీ, ఏనాడూ సాగుచేసిన పరిస్థితి లేదనీ స్థానిక రైతులు చెబుతున్నారు. భూముల ధరలకు రెక్కలురావడంతోనే రాజకీయ నేతలు కోర్టులు కేసులు వేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.వివాదంలో ఉన్న భూములను బడానేతలకు ఎలా పట్టాచేశారనేది చర్చనీయాంశంగా మారింది. 412 ఎకరాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ యెగ్గెం మల్లేష్‌కు 40 ఎకరాలు, విఠల్‌రెడ్డికి ఐదెకరాలు, పాపిరెడ్డి 16ఎకరాలు, మల్‌రెడ్డిరంగారెడ్డి పదెకరాలు, జైపాల్‌రెడ్డి నాలుగెకరాలు, అంజయ్యగౌడ్ 22ఎకరాలు, ఇలా మొత్తం 342 ఎకరాలకు అధికారులు పట్టాలిచ్చారు. 70 ఎకరాలకు మాత్రమే ఇంకా పట్టాలురాలేదని గ్రామస్థులు చెబుతు న్నారు. విజయారెడ్డిని హత్యచేసిన సురేష్‌కు సంబంధించిన భూములు సైతం 70 ఎకరాల్లో ఉందని రైతులు తెలిపారు. కోర్టు కేసు నడుస్తుం డగా బడా నాయకులు ఎలా పట్టాలిచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. తాము లక్షల రూపాయల లంచం ఇచ్చుకోలేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. అయితే నూతన పాస్‌పుస్తకాల జారీవిధానంలో ఎంతోకాలం నుంచి వస్తున్న అనుభవదారుని కాలాన్ని ఎత్తివేయడంతోనే సమస్యగా మారింది. దీని కారణంగానే వందలేండ్ల క్రితం సాదాబైనామా కింద విక్రయించిన భూములకు తామే హక్కుదారులమంటూ రాజాఆనందరావు కుటుంబ సభ్యులు తెరపైకి వచ్చారు. ఫలితంగా తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూములు దక్కవేమోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరుడు విఠల్‌రెడ్డి. విఠల్‌రెడ్డికి కూర సురేష్‌ముదిరాజ్ అత్యంత సన్నిహితుడు. గౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.195లో చెంచలమైసయ్యకు చెందిన ప్రభుత్వ భూమి(లావణ్యపట్టా) 6.16 ఎకరాలు ఉండగా.. కొన్నేండ్ల క్రితం మైసయ్యకు విఠల్‌రెడ్డి రూ.2,500 అప్పు ఇచ్చాడు. ఆ అప్పు తీర్చలేదనే సాకుతో 6.16ఎకరాల భూమిని కబ్జాచేసి తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అందులో కోళ్లఫారాన్ని నిర్మించుకున్నాడు. ఇదే భూమి పేరుతో రైతు సహకార సంఘం ద్వారా రుణాన్ని సైతం పొందినట్టు తెలిసింది. ఈ భూమిపై 2008 నుంచి దళితులు పోరాటం చేయగా హయత్‌నగర్ మండల రెవెన్యూ అధికారులు కోళ్లఫారాలను సీజ్ చేశారు. రెడ్డిగర్జన సభ సందర్భంగా సీజ్‌చేసిన తాళాలను పగులగొట్టి ప్రతినిధులకు ఏర్పాట్లు చేశారు. దీనిపై స్థానికులు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డికి ఫిర్యాదు చేయగా.. మరోసారి సీజ్‌చేశారు. భూమిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాడు. సీజ్‌చేసిన తాళాన్ని తీయాలని విజయారెడ్డిపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరగుతోంది.