అందుబాటులోకి వచ్చేసిన రెండు రకాల చేపలు
హైద్రాబాద్,
తక్కువ ఖర్చు, తక్కువ సమయం, ఎక్కువ లాభం..ఇదే ప్రాతిపదికన జన్యుమార్పిడి చేసి సృష్టించిన రెండు చేపల రకాలు త్వరలో తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఏడాది క్రితం వాటిని తీసుకొచ్చి వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రంలో పెంచారు. ఆ వెంటనే వాణిజ్య పంటగా పైలట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి వరంగల్ జిల్లా లో వర్థన్నపేట,సంగెం, రాయపర్తి మండలాల్లోని ఆరు చెరువుల్లో పెంచుతున్నారు. చేపల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ రెండు రకాలు మత్య్సకారులకు వరంగా మారనున్నాయి. రాష్ట్రం మత్య్సశాఖ పరిధిలో 4,325 చెరువులున్నాయి. వీటిపరిధి మత్స్యకార సంఘాలకు ప్రభుత్వం ఉచితంగా చేపల సీడ్, సబ్సిడీపై రుణాలు, వలలు, బోట్లు అందిస్తోంది. అయితే దిగుబడి ఆశించినంత రావడం లేదు. ఈ రెండు కొత్త రకాల ద్వారా మంచి ఫలితాలు వచ్చేఅవకాశముంది.మన రాష్ట్రంలో రవ్వ, బంగారుతీగ రకాలకు బాగా డిమాండ్. ఆ తర్వాతే బొచ్చె, మెరిగే, బొమ్మె చేపలు.వాణిజ్య పరంగా కూడా రవ్వ, బంగారు తీగలనే పెంచుతారు. వీటికి తరచూ పేనుకొరుకుడు, ఎరుపువ్యాధి, శంఖం జలగ, మొప్పల వ్యాధులు వచ్చి దిగుబడి తగ్గుతోంది. అయితే జయంతి రోహు, అముర్ కార్ప్ రకాల చేపలు వీటిని తట్టుకుంటాయి.బంగారు తీగ శాస్త్రీయ నామం సిఫ్రినస్ కార్పియో.అమ్మకాల్లో రవ్వ తర్వాతి స్థానం దీనిదే. హంగేరీలోఅమూర్ నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న బంగారు తీగ మేలు రకమైనది. ఈ చేపలోని మేలైన జన్యువులతో దేశీ బంగారు తీగలపై బెంగళూరు సమీపంలోని నేషనల్ ఇన్సిస్టి ట్యూట్ ఆఫ్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ లోపరిశోధనలు చేసి అముర్ కార్ప్ ను డెవలప్ చేశారు. సాధారణ బంగారు తీగలకు పొట్ట ఉంటుంది. అముల్‌కార్ప్ కు పొట్ట తక్కువ. ఇవి 27 శాతం అధికంగా పెరుగుతాయి. ఇది కూడా ఆరు నెలల్లోనే కేజీ బరువుకు వస్తుంది. రోగ నిరోధక శక్తి అధికం. బంగారు, పసుపు, తెలుపు రంగుల్లో ఆకట్టుకుంటుంది. సాధారణ బంగారు తీగ హెక్టారుకు 2,580 కేజీల దిగుబడి వస్తే.. అముర్ కార్ప్ 4,255 కేజీల చేపలు వస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. గర్భిణులకు మంచిది కూడా.రవ్వ చేప శాస్త్రీయ నామం లెబియో రోహితా. రాష్ట్రంలో అమ్ముతున్న చేపల్లో 70 శాతం మార్కె ట్ దీనిదే. దీన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం గంగ, యమున, బ్రహ్మపుత్ర, సట్లేజ్, గోమతి వంటి నదీ పరీవాహక ప్రాంతాల్లో లభించే రవ్వ జాతిని ప్రయోగాలకు తీసుకున్నారు. వాటి జీవన విధానం, జన్యుక్రమంపై సెంట్రల్ ఇన్సిస్టి ట్యూట్ ఆఫ్ అక్వాకల్చర్ , భువనేశ్వర్ లో రీసెర్చ్ చేశారు. దాదాపు తొమ్మిది తరాల చేపలపై ప్రయోగాలు చేసి కొత్త రకం చేపను సృష్టించారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించడంలో భాగంగా వరంగల్ కృషి విజ్ఞా న కేంద్రానికి పంపారు. సాధారణ రవ్వ కంటే వీటిలో పెరుగుదల 18 శాతం అధికం. వీటిని ఆహారంలో తీసుకుంటే కండరాల్లో వృద్ధి కన్పిస్తుంది. సాధారణ రవ్వలు ఎనిమిదిన్నర నెలల్లో కేజీ బరువుకు వస్తాయి. కానీ జయంతి రోహు ఆరు నెలల్లోనే కేజీ బరువుకు వస్తుంది. ఒక ఎకరం విస్తీర్ణంలో 1,800 కేజీల రవ్వ దిగుబడి వస్తే జయంతి రోహు 2,200 కేజీలు వస్తుంది. అటూ ఇటుగా ఏడాదికి రెండు పంటలు తీసుకోవచ్చు.నిర్వహణ, పోషణ ఖర్చు 50% తగ్గుతుంది. ఇది చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.