ఈ నెల 18న స్వరాజ్యమైదానంలో కార్తీక కోటి దీపోత్సవం
విజయవాడ
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పయనించాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ లోకకల్యాణార్థం ఈ నెల 18వ తేదీ సాయంత్రం నగరంలోని స్వరాజ్యమైదానంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు కార్తీక కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిఎన్ సప్లయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ అధినేత గరిమెళ్ల నానయ్య చౌదరి (నాని) తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఉదయం స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గరిమెళ్ల నాని మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు కార్తీక దీపానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ఆరాధించి దీపారాధన చేయడం ఫలితంగా కోటి తీర్థాల్లో పుణ్యస్నానం ఆచరించిన ఫలితం లభిస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయని పేర్కొన్నారు. అటువంటి పవిత్రమైన కోటి దీపోత్సవంలో నగరవాసులకు కూడా అవకాశం కల్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నెల 18న (సోమవారం) సాయంత్రం 5:30 గంటలకు స్వరాజ్యమైదానంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు కార్తీక కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ లోగా ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల సమయంలో భక్తులు తమ పేర్లను స్వరాజ్య మైదానానికి విచ్చేసి నమోదు చేసుకోవాలని తెలిపారు. 18న సాయంత్రం 4 గంటలలోగా స్వరాజ్యమైదానానికి విచ్చేసి కేటాయించిన చోట కూర్చోవాలని పేర్కొన్నారు. అలాగే కోటి దీపోత్సవానికి కావాల్సిన పూజా సామాగ్రి కూడా కమిటీ తరఫున ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవి సేవా సమితి తరఫున కమిటీ సభ్యులు పూర్తి సహాయసహకారాలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు ఆలూరి రాజమోహన్ బృందంచే భక్తి సంకీర్తనలు ఉంటాయని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవి సేవా సమితి సభ్యులు దూపగుంట్ల శ్రీనివాసరావు, రెడ్డి ఉమామహేశ్వర గుప్తా, చింతలపూడి రఘురాం పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం, కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రారంభం శుభసూచకంగా 9వ తేదీ (శనివారం) సాయంత్రం 5 గంటలకు స్వరాజ్య మైదానంలో సుబ్రహ్మణ్య స్వామివారి పూజ, 100 మంది మహిళలచే పసుపు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అయన వెల్లడించారు