ఉపాధి హామి నిధులు విడుదల చేయాలి
ఏలూరు
తక్షణమే ఉపాధి హామీ నిధుల బకాయిలను విడుదల చేయాలని.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న 13 వేల గ్రామ పంచాయతీలలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అంగన్‌వాడీ భవనాలు, స్కూల్ బిల్డింగ్‌లు తదితర నిర్మాణ పనులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో భాగంగా నిర్మించారన్నారు. వాటికి సంబంధించిన రూ.2500 కోట్ల రూపాయలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను తీర్చమని కేంద్ర ప్రభుత్వం మన రాష్ర్టానికి ఐదు నెలల కిందటే రెండు వేల కోట్లు పంపడం జరిగిందని తెలిపారు.