Highlights
వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు
సా. 6 నుండి 7 గం.ల వరకు ఊంజల్‌సేవ
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కైవల్య జ్ఞానప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం. వాహనసేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు విశేషషగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
హంస వాహనం : ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. 'సోహం' భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి 'దాసోహం' అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు ఆధారాలున్నాయని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా మార్చి 20న గరుడసేవ, మార్చి 21న హనుమంత వాహనం, మార్చి 23న రథోత్సవం, మార్చి 24న చక్రస్నానం జరుగనున్నాయన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని తెలిపారు. సివిఎస్‌వో ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు.
ఆలయ ప్రధాన కంకణభట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు ప్రసంగిస్తూ ధ్వజారోహణంతో సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు తెలిపారు. రాముడు ధర్మస్వరూపుడని, ఆయన ఆదర్శాలను భక్తులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ధ్వజారోహణంలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తే సమస్తదోషాలు తొలగుతాయని, సంతానం లేనివారికి ఉత్తమ సంతానం కలుగుతుందని తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్.వి.సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 7 నుండి 8 గంటల వరకు ధర్మగిరి వేద పాఠశాల ఆధ్వర్యంలో వేదపారాయణం నిర్వహించారు. వాహనసేవల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ, పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు, తిరుపతికి చెందిన కళాబృందాలు కోలాటాలు ప్రదర్శించాయి. శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.00 నుండి 8.30 గంటల వరకు ఎం.రాముడు భాగవతార్ హరికథ పారాయణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఝన్సీరాణి, సూపరింటెండెంట్ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శేషారెడ్డి, మురళీకృష్ణ , ఏవీఎస్ఓ శ్రీ గంగరాజు ,శ్రీవారి సేవకులు , ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.