తెలంగాణలో 34 ఏళ్ల నాటి పరిస్థితులు
జిల్లాల పర్యటనలకు తమిళసై
హైద్రాబాద్,
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలి 1985లో ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా వ్యవహరించిన కుముద్ బెన్ జోషిని గుర్తు చేస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో చురుకుగా ఉన్న కుముద్‌బెన్‌ను నాటి సీఎం ఎన్టీఆర్‌ను ఇరుకున పెట్టే లక్ష్యంతో అప్పటి ప్రధాని రాజీవ్ గాందీ నియమించారనే ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరేలా ఆమె కూడా సొంత కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న చందంగా వ్యవహరించారు. తరుచూ టీడీపీ ప్రభుత్వంతో గొడవకు దిగడం, కాంగ్రెస్ నేతలకు రాజ్‌భవన్ మరో స్థావరంగా మారడం, ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆమే స్వయంగా జిల్లాలలో పర్యటించడం లాంటివి వివాదానికి కారణమయ్యాయి.గణతంత్ర దినోత్సవం నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ జోషి చేసిన ప్రసంగం ఓ సంచలనం సృష్టించింది. ఆమె రాష్ట్రంలో చేసిన పర్యటనలు కాంగ్రెస్ పార్టీని బలపరిచాయని టీడీపీ నేతలు బాహాటంగానే అప్పట్లో విమర్శించారు. ఇప్పుడు గవర్నర్ తమిళసై వ్యవహార శైలి కూడా కేసీఆర్‌ను ఇబ్బందికి గురిచేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇటీవల ప్రజా దర్బారు నిర్వహిస్తానని ప్రకటించిన తమిళిసై.. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి ఆర్టీసీ సమ్మెపై నివేదిక ఇచ్చినట్టు సమాచారం.అంతేకాదు, సమ్మె విషయమై రవాణా శాఖా మంత్రికి తమిళిసై ఫోన్ చేయగా.. ఆయన చేసేదేమీ లేక ఆ శాఖ కార్యదర్శి సునీల్ శర్మను గవర్నర్ వద్దకు పంపారు. పూర్తి నివేదికతో గవర్నర్‌ను సునీల్ శర్మ కలిశారనే ప్రచారం సాగింది. గవర్నర్ నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేయకుండా రవాణా శాఖా మంత్రికి ఫోన్ చేయడం కొత్త చర్చకు తెరలేపింది. గవర్నర్ స్వయంగా మంత్రికి ఫోన్ చేయడం వెనుక కేసీఆర్ ఇమేజ్‌ను తగ్గించడమే అనే ఉద్దేశం దాగి ఉందని అంటున్నారు.తమిళిసై కంటే ముందు గవర్నర్‌గా ఉన్న నరసింహన్.. కేసీఆర్‌తో మంచి సంబంధాలు కొనసాగించారు. అయితే, గవర్నర్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించేవారు. గవర్నర్‌ను మార్చాలని డిమాండ్ చేయడంతో కేంద్రం నరసింహన్‌కు ఉద్వాసన పలికి రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్న తమిళసైను తెలంగాణకు గవర్నర్‌గా నియమించారుతెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసమే తమిళిసైను గవర్నర్‌గా నియమించారని, గతంలో కాంగ్రెస్ అప్పగించిన బాధ్యతలను కుముద్‌బెన్ జోషి ఎలా విజయవంతంగా నిర్వహించారో ఇప్పుడు సౌందరరాజన్ కూడా ఆ పాత్ర పోషిస్తారని అంటున్నారు. రాజ్‌భవన్‌లో సమీక్షలు, ఐఏఎస్ ఇతర అధికారులతో జోషి సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం తమిళిసై కూడా ఇలాంటి సమీక్షలే నిర్వహిస్తున్నారు. ఇటీవల విద్య, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించి జోషిని గుర్తుచేశారు. అప్పట్లో కాంగ్రెస్ నేతలకు రాజ్‌భవన్ మరో స్థావరంగా మారితే, ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ నివాసానికి క్యూ కడుతున్నారు.ఇక, 1985 నవంబరు 26 నుంచి 1990 ఫిబ్రవరి 7 వరకు ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా ఉన్న కుముద్‌బెన్ జోషి 23 జిల్లాల్లో 108సార్లు పర్యటించారు. ప్రస్తుత గవర్నర్ తమిళసై కూడా త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. కుముద్‌బెన్ జోషితో విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆమె పర్యటనలకు టీడీపీ శ్రేణులు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. దాదాపు సమాంతర ప్రభుత్వాన్ని జోషి నడపడంతో అప్పట్లో టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ప్రస్తుతం గవర్నర్ వైఖరిపై కూడా అధికార టీఆర్‌ఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీలో అంతర్గతంగా ఈ అంశంపై చర్చించుకుంటున్నారని, బయటపడటం లేదని అంటున్నారు. ఆర్టీసీ సమ్మెపై రవాణా మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ సహ ఇతర అధికారులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించడంపై టీఆర్ఎస్ అసహనంతో ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో గవర్నర్ మరింత క్రీయాశీలకంగా ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.