YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మీసం మెలేయలేకపోయిన విష్ణు

మీసం మెలేయలేకపోయిన విష్ణు

మీసం మెలేయలేకపోయిన విష్ణు
హైద్రాబాద్, 
యువ విలక్షణ నటుడు శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ అని ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించి.. సినిమా స్టార్టింగ్‌లోనే విలన్స్‌తో తన్నులు తిని తిప్పిన మీసాన్ని గొరికించేసుకుంటున్నాడేంటి? ఇదేదో ఇంట్రస్టింగ్‌నే ఉందే అనేట్టుగా ‘తిప్పరా మీసం’ కథలోకి తీసుకువెళ్లాడు.ఆటలో గెలుపును ఆస్వాదించడం కోసం మీసం మెలేస్తాం.. ఆ మెలేసిన మీసానికి కారణం శత్రువు అయితే ఆ కిక్కే వేరు. కాని శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ తనపై తాను గెలవడం కోసం.. తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు, బంధం, బంధుత్వం కంటే కూడా అతని గెలుపే ముఖ్యం. అతని గెలుపు కోసమే మీసం తిప్పుతాడు. అలాంటి డ్రగ్ కంటే ప్రమాదకరమైన అడిక్ట్.. మంచి గెలవడం కోసం మీసం ఎలా తిప్పాడు, తన తల్లి కోసం మారాల్సి వస్తే ఏం త్యాగం చేశాడు అన్నదే సినిమా కథ.మణి శంకర్ (శ్రీవిష్ణు) చిన్నప్పటి నుండే డ్రగ్ అడిక్ట్. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో లైబ్రేరియన్ లలితా దేవి (రోహిణి) కొడుకు మణిని గారాబంగా పెంచుతుంది. అయితే మణి చదివే స్కూల్ దగ్గర్లో ఐస్ క్రీమ్‌లో మత్తు మందుని కలిపి పిల్లలు వాటికి అడిక్ట్ అయ్యేలా చేస్తారు. వాటికి అలవాటు పడ్డ మణి డ్రగ్స్‌కి బానిస అవుతాడు. డ్రగ్స్ కోసం.. చిన్నప్పుడే ఫోర్జరీ సంతకాలు నేర్చుకుని చెడు వ్యసనాలతో దారితప్పుతాడు. అతనిలో మార్పును తీసుకువచ్చేందుకు లలితా దేవి కొడుకుని రిహాబిలిటేషన్ సెంటర్‌లో జాయిన్ చేస్తుంది. అయితే డ్రగ్స్‌కి బానిస అయిపోవడం వల్ల మణి అక్కడ నుండి పారిపోయి ఇంటికి వచ్చేస్తాడు. లలితా దేవి తప్పనిసరి పరిస్థితుల్లో మణికి ఇష్టం లేకపోయినా మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్‌లో బలవంతంగా ఉంచుతుంది. దీంతో తల్లిపై కక్ష పెంచుకుంటాడు మణి. అక్కడ నుండి పారిపోయి ఓ పబ్‌లో డీజేగా జాయిన్ అయ్యి పెరిగి పెద్దవాడవుతాడు.అయితే కొడుకు ఏనాడైనా తనకోసం తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ ఉంటుంది లలితాదేవి. అయితే మణికి డ్రగ్స్‌తో పాటు క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఉండటంతో బుకీకి రూ. 30 లక్షలు అప్పుపడతాడు. ఈ అప్పును తీర్చడానికి డబ్బు కోసం తల్లి దగ్గరకు వెళ్తాడు మణి. అయితే తన దగ్గర అంత డబ్బులేదని లలితా దేవి చెప్పడంతో ఆమెపై కోర్టులో కేసు వేస్తాడు. కోర్టులో లలితా దేవి కొడుక్కి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుని ఇల్లు తాకట్టు పెట్టి మణికి డబ్బు ఇస్తుంది. అయితే కథలో ఇక్కడే మలుపు ఉంటుంది.ఒక గేమ్‌లో మణి గెల్చుకున్న డబ్బుని కాజేస్తాడు ఎమ్మెల్యే కొడుకు కాళి. ఆ కాళిని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా అతనితో మణికి గొడవలు అవుతూ ఉంటాయి. అయితే సడెన్‌గా కాళి హత్యకు గురౌతాడు. ఆ నిందను కాళిపై వేసుకుని జైలుకు వెళ్తాడు. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? మణి ఎందుకు జైలుకు వెళ్లాడు? అతనిలో మార్పుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? చివరికి తన తల్లిని కలుసుకున్నాడా? అన్నదే మిగిలిన కథ.శ్రీవిష్ణు టాలెంటెడ్ యాక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే విలక్షణ నటనతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఎంత టాలెంట్ ఉన్న నటుడికైనా సరైన హిట్ పడితేనే సక్సెస్ఫుల్ హీరో కాగలడు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన శ్రీవిష్ణుకి హిట్స్ దక్కాయి కాని.. అవి వేరే హీరోతో షేర్ చేసుకున్నవే. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి చిత్రాలతో సెటిల్డ్ యాక్టర్ అనిపించుకున్న శ్రీవిష్ణు.. సోలోగా హిట్ కొట్టేందుకు ఈసారి పూర్తి మాస్ సినిమా చేసాడు. రస్టిక్‌గా కనిపించి మెస్మరైజ్ చేశాడు. నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తనలోని విలక్షణ నటనను చూపించాడు.డ్రగ్స్ బానిసగా, తల్లిని వేధించే కొడుకుగా, బంధాలు బంధుత్వాలు లేని వ్యక్తిగా ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ శ్రీవిష్ణుని తిట్టుకోలేని తల్లి ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతలా తన తల్లిని ఆస్తికోసం వేధించిన పాత్రలో జీవించేశాడు. ఒకే పాత్రలో డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ విలక్షణ నటనను చూపించాడు. చెడ్డీతో రోడ్డు మీద పరుగుపెట్టే సీన్, మీసాలు తీసేసే సీన్, స్టార్టింగ్‌లో అండర్ వాటర్ సీన్‌‌లో మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నాడు.అయితే నూరొంతులు నటించే హీరో దొరికినప్పటికీ కథను ఆసక్తిగా మలచగలిగే దర్శకుడు ఉండాలి. అప్పుడే ఆ కథ రక్తికడుతుంది. హీరోగా శ్రీవిష్ణు పూర్తి న్యాయం చేసినప్పటికీ కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమాలో ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేసే సన్నివేశం ఒక్కటి కూడా చొప్పించలేకపోయాడు దర్శకుడు.తల్లీ కొడుకుల సెంటిమెంట్స్ ఈ చిత్ర కథకు బేస్ అయినప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం బోరింగ్‌గా మారింది. దర్శకుడు విజయ్ క్రిష్ణ (అసుర ఫేమ్).. కథను ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టినా స్క్రీన్ ప్లేపై గ్రిప్పింగ్ లేకుండా పోయింది. ఇంకా ఏదో చెప్తాడు అనే ఇంట్రస్ట్‌ని ప్రేక్షకుల్లో కలిగించి.. చివరికి వచ్చే సరికి ప్రేక్షకుడి ఊహలకు లోబడి సింపుల్‌గా తేల్చేశారు. కథలో ట్విస్ట్‌లు ఉన్నా.. అప్పటికే ప్రేక్షకుడికి కథ నుండి కనెక్టివిటీ పోయేలా కథనాన్ని నడిపించారు.హీరోని ప్రజెంట్ చేయడంలో పెట్టిన శ్రద్ధ.. కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో పెట్టలేదు. మదర్ సెంటిమెంట్‌తో వచ్చే సన్నివేశాలు కంటతడిపెట్టించేవిగా ఉన్నప్పటికీ క్లైమాక్స్ సన్నివేశాలు నాటకీయంగా అనిపిస్తాయి. శ్రీవిష్ణుకి తల్లిగా రోహిణి మరోసారి తన సీనియారిటీని చూపించారు. తల్లికొడుకుల కాంబినేషన్ సీన్లు ఎమోషనల్‌గా వర్కౌట్ అయ్యాయి.ఇక కథలో కీలకమైన హీరోయిన్ నిక్కీ తంబోలీ.. మోనీకా పాత్రలో పర్వాలేదనిపించింది. పోలీస్ ఆఫీసర్‌ పాత్రకు సూట్ అయ్యింది. గ్లామర్‌కు దూరంగా కథలో భాగమైంది. ఉన్నంతలో పరిధిమేర బాగానే నటించింది. హీరోకి ఫ్రెండ్‌గా నటించిన నవీన్ కామెడీతో పర్వాలేదనిపించాడు. అక్కడక్కడా పంచ్‌లు పేలినా.. కొన్ని చోట్ల రొటీన్ కామెడీగా అనిపిస్తుంది.సినిమా బాగానే ఉంది. లొకేషన్ల కోసం పెద్దగా ఖర్చు చేసినట్టు అనిపించదు. సినిమా అర్ధభాగం అంతా ఒక పబ్‌లోనే కానిచ్చేశారు. అయితే సినిమాటోగ్రాఫర్ సిద్ లొకేషన్స్‌ని రిచ్‌గా చూపించారు. హైదరాబాద్ నేటివిటీని బాగా చూపించారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్లస్ అయ్యింది. కథకు అనుగుణంగా మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు సురేశ్‌ బొబ్బలి. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి.శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’ అని ఎంత గట్టిగా తిప్పినా.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి మీసం మెలేయలేకపోయాడు.

Related Posts