కరకట్టకు అడగడుగునా అడ్డంకులు
విజయవాడ,
సముద్ర తీర కరకట్ట నిర్మాణ పనులు ఒకడుగు ముందుకు రెండడుగుల వెనక్కి చందంగా సాగుతున్నాయి. కేంద్రం నిధులు మంజూరుకు అవసరమైన సమగ్ర ప్రణాళికల (డిపిఆర్) రూపకల్పనలో తీవ్ర తాత్సారం జరుగుతోంది. దీంతో, చివరి దశలో మిగిలిన 45 కిలోమీటర్ల పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలవని పరిస్థితి నెలకొంది. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నాయి.తుపానులు, సునామీల సమయంలో సముద్ర అలలు సమీప గ్రామాలను ముంచెత్తకుండా నాగాయలంక నుంచి కృత్తివెన్ను వరకు తీరప్రాంత పొడవునా కరకట్ట పనులు చేపట్టారు. నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం పాలకాయతిప్ప వరకు కరకట్ట పనులు పూర్తయ్యాయి. మచిలీపట్నం-కృత్తివెన్ను ప్రాంతానికి మధ్య నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే డిపిఆర్ ఆధారంగా కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థ ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తుంది. మొత్తం 77.6 కిలోమీటర్లు కరకట్ట నిర్మించాల్సి ఉంది. మొదటి దశ పనులకు 2013-14 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం రూ. 61 కోట్లు విడుదలయ్యాయి. దీంతో రూ.32 కోట్లతో పోలాటితిప్ప-మాలకాయలంక (18.06 కిలోమీటర్లు), రూ.29 కోట్లతో కృత్తివెన్ను-ఇంతేరు (14 కిలోమీటర్లు) కరకట్ట నిర్మాణ పనులు 2017లోనే పూర్తయ్యాయి. ఇంతేరు-పెదపట్నం, మంగినపూడి మధ్య మరో 45 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం మిగిలిపోయిందిఈ ప్రాజెక్టుపై సర్వే, కరకట్ట నిర్మించాల్సిన ప్రాంతం, వ్యయం, అవసరం తదితర అంశాలపై డిపిఆర్ రూపొందించి ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు పంపిస్తే, ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులను కేంద్రం ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. విపత్తుల నివారణ, కొనసాగింపు ప్రాజెక్టు కావడంతో నిధుల విడుదలకు కేంద్రం చొరవ చూపాల్సి ఉంటుంది. అయితే, మడ అడవులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతంలో కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర పర్యావరణ శాఖ, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సిఆర్‌జడ్) అనుమతులు అవసరం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది.