Highlights
- ఈ సంవత్సరం రాజు సూర్యుడు (రవి),
- మంత్రి శని,
- సేనాధిపతి, ఆర్ఘాధిపతి, మేఘాధిపతి శుక్రుడు,
- సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు,
- ధాన్యాధిపతి రవి,
- రసాధిపతి గురుడు.
- లోహాల ధరలు పెరిగే సూచనలు
- వ్యవసాయ రంగం ఆటుపోట్లు
- శాంతిభద్రతల లోపం
- కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గద్దెనెక్కుతాయి
- ప్రజలు ఆశించిన రీతిలో పాలన
నవనాయకుల్లో నలుగురు శుభులు, ఐదురుగు పాపులు. అలాగే, ఉపనాయకుల్లోని 21మందిలో 11మంది శుభులు, మిగతా వారు పాపులు. రాజు రవి కావడం, మంత్రి శని కావడం, ఇద్దరూ శత్రువులు అయినందున పాలనాపరంగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా అధిగమించి ప్రజలు ఆశించిన రీతిలో పాలన కొనసాగుతుంది.
పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. గోధుమలు, వరి సహా ఎరుపు ధాన్యాల దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే, ఎరుపు నేలలు బాగుగా పండుతాయి.
కళారంగాల వారికి విశేష లాభదాయకమైన కాలమనే చెప్పాలి. వీరికి అవార్డులు, రివార్డులు దక్కుతాయి.
అలాగే, పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా సహాయం అందుతుంది. మంత్రి శని కావడం వల్ల మేఘాలు, గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల అతివృష్టి, మరికొన్ని చోట్ల అనావృష్టి పరిస్థితులు నెలకొంటాయి.మొత్తం మీద పరిశీలించగా కేంద్రంలో పాలనాపరమైన మార్పులు జరుగుతాయి. అలాగే, పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఊరటనిస్తాయి. రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొన్నా కేంద్రం చొరవతో సర్దుబాటు కాగలవు.
శాంతిభద్రతల లోపంతో దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఘర్షణలు, ఉద్యమాలు చెలరేగి ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశాలున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అలాగే, కొన్ని రాష్ట్రాల్లో పాలక పార్టీలు మారవచ్చు.
సాంకేతిక రంగాలు మరింత పుంజకుంటాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ పుంజుకుంటుంది.
వ్యవసాయ రంగం ఆటుపోట్లు ఎదుర్కొన్నా రైతులకు కొంత లాభదాయకంగానే ఉంటుంది.
వైద్యం, పరిశోధనా రంగాల వారికి విశేషయోగదాయకంగా ఉంటుంది.
ఈ ఏడాది ఎరుపు భూములు బాగా పండుతాయి. అలాగే, వాణిజ్య పంటల దిగుబడి మరింత పెరుగుతుంది. అపరాలు, మిర్చి, చింతపండు పంటలు విశేషం. తూర్పు, దక్షిణ ప్రాంతాలలో సుభిక్షం. ఇతర ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులతో ఇక్కట్లు తప్పకపోవచ్చు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో అధికంగానూ, దక్షిణ, వాయువ్య ప్రాంతాల్లో సామాన్యంగా వర్షాలు కురుస్తాయి.
బంగారం, వెండి, రాగి లోహాల ధరలు పెరిగే సూచనలు. ఈ ఏడాది 9భాగాల వర్షం సముద్రమందు, 9 భాగాలు పర్వతాలయందు, 2 భాగాలు నేలపై కురుస్తుంది.
ఈ ఏడాది వర్ష లగ్నం కన్యారాశి అయినది. లగ్న, దశమాధిపతి బుధుడు లాభాధిపతి చంద్రుడు, వ్యయాధిపతి రవి, ద్వితీయ, భాగ్యాధిపతి శుక్రునితో కలిసి సప్తమమైన మీనంలో కలయిక. ద్వితీయ మందు గురుడు, తృతీయ, అష్టమాధిపతి కుజుడు పంచమ, షష్ఠాధిపతి శనితో చేరి చతుర్ధమైన ధనుస్సులోనూ, పంచమమైన మకరంలో కేతువు, లాభ మైన కర్కాటకంలో రాహువు సంచారం.
ఇక జగర్లగ్నం మిథునమైనది. లగ్నాధిపతి బుధుడు ద్వితీయాధిపతి చంద్రునితో కలిసి దశమమైన మీనంలోనూ, ద్వితీయంలో రాహువు, పంచమంలో సప్తమ, దశమాధిపతి గురుడు, అష్టమ, భాగ్యాధిపతి శని, షష్ఠమ, లాభాధిపతి కుజునితో కలిసి సప్తమమైన ధనుస్సులో, అష్టమంలో కేతువు, తృతీయాధిపతి రవి, పంచమ, వ్యయాధిపతి శుక్రుడితో కలిసి దశమమైన మేషరాశిలో సంచారం.
వీటిరీత్యా చూస్తే పాలకుల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు. ప్రతిపక్షాల నుంచి అధికార పక్షానికి సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం వాటిని అధిగమిస్తుంది. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు మంచి కాలమనే చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలు వీరికి ఉపకరిస్తాయి.
విద్యార్థులకు కూడా అనుకూలమైనదే. రాజు రవి కావడం వల్ల నాయకులు పేరు ప్రతిష్ఠలు పొందుతారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారికి విశేషంగా రాణిస్తుంది. చిత్రపరిశ్రమ పుంజుకుంటుంది. కళాకారులకు ప్రోత్సాహవంతంగా ఉంటుంది. తూర్పు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలు భారీ వర్షాలు, తుపానులతో అతలాకుతలమవుతాయి. అలాగే, వరదలు వణికించవచ్చు. ఉత్తరాదిన భూకంపాల ప్రభావం కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. మహిళలు ప్రభుత్వాలలో కీలకపాత్ర పోషిస్తారు. ఒక కీలకనేతకు గడ్డుకాలమనే చెప్పాలి. విమాన, రైలు, బస్సు ప్రమాదాలు కొంత కలవరపెట్టవచ్చు. పశు పోషణ, మత్స్య, ఇతర వ్యవసాయానుబంధ రంగాల పై ఆధారపడిన వారికి లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద కొన్ని ఒడిడుదుడుకులు ఎదురైనా ప్రజలకు అనుగుణంగా పాలకులు వ్యవహరించే అవకాశాలున్నాయి.
ఆర్థిక ఒడిదుడుకులు కారణంగా స్టాక్‌మార్కెట్లు తరచూ పతనం కావచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. ఉల్లి, చింతపండు ధరలు విశేషంగా పెరుగుతాయి.
ఏదేమైనా రాజు రవి, మంత్రి శని కావడం వల్ల దేశంలోని అధికార, ప్రతిపక్షాల మధ్య స్పర్ధలు పెరుగుతాయి. క్రీడాకారులకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి.
ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం చివరిలో తొలకరి జల్లులు కురుస్తాయి. శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఉద్యమాలకు తెరలేచే అవకాశం. అక్టోబర్, నవంబర్‌మధ్యకాలంలో కాల సర్పదోషం కారణంగా వింత వ్యాధులు, భారీచోరీలు, ప్రకృతి వైపరీత్యాలు తప్పకపోవచ్చు. విళంబినామ సంవత్సరంలో ప్రజల్లో దైవభక్తి పెరుగుతుంది. దానధర్మాలను ఇతోధికంగా చేస్తారు.
నిజ జ్యేష్ఠ శు.దశమి శుక్రవారం అనగా జూన్ 22వ తేదీ రాత్రి 7.13 గంటలకు చిత్తా నక్షత్రమందు రవి ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశం. ఈరీత్యా చూస్తే రాత్రి పూట రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం. దీనివల్ల శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఈ ఏడాది పశుపాలకుడు యముడు కావడం వల్ల పశునష్టం, గోష్టప్రాపకుడు, గోష్టబహిష్కర్త శ్రీ కృష్ణుడు కావడం వల్ల పశుసంపద, పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుంది.
♦నవనాయక ఫలాలు....♦
1. రవి– రాజు కావడం వల్ల అగ్ని, శస్త్రాల వల్ల భయాందోళనలు. అల్పవృష్టి, చోరాగ్ని, రోగాలతో ప్రజలకు ఇబ్బందులు. రాజకీయాల్లో కొంత అస్తవ్యస్థ పరిస్థితులు, పాలకుల మధ్య వివాదాలు నెలకొనవచ్చు. గోధుమలు, ధాన్యం, పగడాలు, మిరియాలు, కందులు, వేరుసెనగ, కొబ్బరికి గిరాకీ పెరుగుతుంది.
2. శని– మంత్రి
కావడం వల్ల వర్షాలు కొంత తగ్గే సూచనలు. రోగాగ్ని బాధలు. ప్రజలకు సమస్యలు ఎదురుకావచ్చు. ధాన్యం వంటి ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి.
3. సైన్యాధిపతి– శుక్రుడు కావడం వల్ల సువృష్టి, సస్యాల వృద్ధి. సుభిక్షం, ధాన్యాల ధరలు పెరుగుతాయి. వస్త్రాలు, నూలు, పత్తి ధరలు పెరుగుతాయి.
4. సస్యాధిపతి– కుజుడు కావడం వల్ల కందులు, మిర్చి, వేరుసెనగ, ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి. మెట్టపంటలు అధికమవుతాయి.
5. ధాన్యాధిపతి– రవి– వర్షాలు తక్కువగా ఉంటాయి. ఆహార ధాన్యాల ధరలపై పరిమితులు విధిస్తారు. రాజకీయ ఒడిదుడుకులు, దేశంలో అలజడులు, ఆందోళనలు. వెండి,బంగారం ధరలు పెరిగి నిలకడగా ఉంటాయి.
6.ఆర్ఘాధిపతి–శుక్రుడు–వర్షాలు అనుకూలిస్తాయి. ధాన్యాల ధరలు అందుబాటులో ఉంటాయి. బియ్యం, రాగి, పట్టు, పత్తి ధరలు సమతూకంగా ఉంటాయి.
7. మేఘాధిపతి–శుక్రుడు–అతివృష్టి, సుభిక్షం, ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు. పాడి సమృద్ధిగా ఉంటాయి.
8. రసాధిపతి– గురుడు. వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. బంగారం, వెండి, నెయ్యి, పట్టు, బెల్లం, పంచదార, వస్త్రాల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
9. నీరసాధిపతి–కుజుడు...
సుగంధ ద్రవ్యాలు, బంగారం, చందనం, ఉక్కు, యంత్రపరికరాలు, రాగి, ఇత్తడి, మిర్చి, పొగాకు, ఉక్కు, అపరధాన్యాల ధరలు పెరుగుతాయి. బియ్యం ధరలు కొంత తగ్గుతాయి.