YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం దేశీయం

అయోధ్య రాముడిదే తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనం

అయోధ్య రాముడిదే తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనం

అయోధ్య రాముడిదే తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనం
134 ఏళ్ల వివాదానికి తెర
న్యూఢిల్లీ, 
అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును చదివివినిపించారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సూచించింది. స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపింది.అయోధ్య తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. '2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్‌కి అప్పగించండి. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని' తీర్పులో వెల్లడించింది. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని పేర్కొంది.'రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి. రెండు మతాలవారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిపేవారని ముస్లింలూ విశ్వసిస్తారు. ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుంది. ఇది పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించింది. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు. మసీదు ఎవరు కట్టారో ఎప్పుడు నిర్మించారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదు. నిర్ణయానికి ముందు 2 మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నాం. మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయి. దేవాలయాన్ని ధ్వంసం చేశారనడానికి పురవాస్తు ఆధారాలు లేవు. 12-16 శతాబ్ధాల మధ్య అక్కడేముందో చెప్పడానికి పురావస్తు ఆధారాలు కూడా లేవు. అయోధ్యను హిందువులు రామజన్మ భూమిగా భావిస్తారని' సీజేఐ వివరించారు.దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలను తావు లేకుండా ఒకే తీర్పు ఇచ్చింది. షియా వక్ఫ్ బోర్డు, అఖాడా వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. యాజమాన్య హక్కులు కోరుతూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదం కాదని సుప్రీం స్పష్టం చేసింది. మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని సీజేఐ వ్యాఖ్యానించారు.

Related Posts