అయోధ్య తీర్పు ఏ ఒక్కరి గెలుపు,ఓటమిగా భావించరాదు: ప్రధాని
న్యూఢిల్లీ
అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ తీర్పు ఏ ఒక్కరి గెలుపు లేదా ఓటమిగా భావించరాదని ఆయన అభ్యర్థించారు. ‘‘సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించింది. ఇది ఏ ఒక్కరి గెలుపు లేదా ఓటమిగా భావించకూడదు. రామ-భక్తి అయినా రహీమ్-భక్తి అయినా ఇది భారత-భక్తిని పరిపుష్టం చేయడానికి చాలా అవసరం. దేశ ప్రజలంతా శాంతి, సామరస్యం, ఐకమత్యంతో మెలగాలని కోరుతున్నాను...’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. 134 ఏళ్ల అయోధ్య భూ వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణం కోసం రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించింది. అయితే ముస్లింలు అయోధ్యలో మసీదు నిర్మించుకునేలా ప్రత్యామ్నాయ 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని షరతు విధించింది.