9 మంది ప్రధానులు చేయలేనిది....
మోడీ చేసి చూపించారు
న్యూఢిల్లీ,
అయోధ్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. తొలుత మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీం నియమించినా పరిష్కారం లభించలేదు. సమస్య పరిష్కారం కోసం 30 ఏళ్ల కిందట తొలిసారిగా ఇలాంటి చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడం గమనార్హం. అంతేకాదు, ఎనిమిది మంది ప్రధానులు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అయోధ్య వివాదాన్ని చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలనే ఆలోచనతో తొలిసారిగా 1986లో కంచి పీఠాధిపతి శంకరాచార్య, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అధ్యక్షుడు మౌలానా అబుల్ హసన్ అలీ హసానీ నాద్వీ (అలీ మియాన్) సమావేశమయ్యారు.ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తున్నా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కంచి శంకరాచార్యకు అలీ మియాన్ తెలిపారు. ఇందుకు ఏఐఎంపీఎల్బీలోని సభ్యులు సమ్మతంగా ఉన్నారని ఆయన తెలిపినా, వివిధ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఈ విషయంలో తాను చొరవ తీసుకోలేనని శంకరాచార్య వెనక్కుతగ్గారు. ఇక, 1990లో నాటి ప్రధాని వీపీ సింగ్ కొంత మంది అధికారుల సాయంతో తొలిసారిగా కోర్టు ప్రమేయం లేకుండా వివాదం పరిష్కారం కోసం ప్రయత్నం ప్రారంభించారు.కానీ, ఈ ప్రక్రియ మొగ్గ దశలో ఉండగానే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కోర్టు వెలుపల పరిష్కారం కోసం ప్రయత్నాల్లో భాగంగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామి ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం వర్గాలు అనేక సార్లు సమావేశమయ్యాయి. ఇందు కోసం నాటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ నేతృత్వంలోని ఓ అత్యున్నత కమిటీని నియమించారు. ఇందులో యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్, మహారాష్ట్ర సీఎం శరద్ పవార్, రాజస్థాన్ సీఎం భైరామ్ సింగ్ షేకావత్‌లను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే పార్లమెంటు రద్దయ్యింది.తర్వాత 1992లో ప్రధాని పీవీ నరసింహారావు కూడా తన వంతు ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా చంద్రస్వామి మధ్యవర్తిత్వం వహించారు. చర్చలు ఫలప్రదమయ్యే తరుణంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. దశాబ్దం పాటు అయోధ్య వివాదం పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తిరిగి 2000-02 మధ్య నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చర్చలకు తెరతీశారు. ప్రధాని అధ్యక్షత అయోధ్య సెల్‌ను ఏర్పాటుచేసి ఇరు వర్గాలను చర్చలకు ఆహ్వానించారు. వీహెచ్‌పీ, అఖిల భారత్ ముస్లిం పర్సనల్ లా బోర్డులకు మధ్యవర్తిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కునాల్ కిశోర్‌ను నియమించారు. కానీ ఇవి కూడా సత్ఫలితాన్విలేకపోయాయి.మరోసారి 2002-03 మధ్యకాలంలో కంచికామకోటి కొత్త పీఠాధిపతి శంకరాచార్యను తిరిగి ముస్లిం లా బోర్డు సంప్రదించింది. వారి కోరిక మేరకు కొన్ని ప్రతిపాదనలతో లక్నోలోని దారుల్ ఉలూమ్ నద్వాతుల్ ఉల్మాకు విచ్చేశారు. అయితే, ఆయన చేసిన ప్రతిపాదనలు కొన్నింటిని ఏఐఎంపీఎల్బీ తోసిపుచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం హయాంలో ప్రధాని మన్మోహన్ ఎలాంటి చర్చలు చేపట్టలేదు. అయోధ్య వివాదంపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. తర్వాత ఇది సుప్రీంకోర్టుకు చేరింది.తాజాగా, వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వక్ఫ్ బోర్డుకు అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని పేర్కొంది. దీంతో గత ప్రధానుల హయాంలో పరిష్కారం కాని సమస్య మోదీ హయాంలో సుప్రీం తీర్పుతో పరిష్కారమైంది. ప్రధాని మోదీ హయాంలోనే దీనికి పరిస్కారం లభించడం ఆయన విజయంగానే చెప్పుకోవచ్చు.