తండ్రి సమాధిని తొలగించాలని సీఎం ఆదేశం
భువనేశ్వర్, నవంబర్ 11
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూటే వేరు. ఆయన అందరి ముఖ్యమంత్రులు లాంటి వారు కాదు. అందుకే ఆయన ఐదు దఫాలుగా వరస గెలుపులతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఆయన విజయరహస్యం కోసం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధ్యయనం చేయాల్సిన పరిస్థితి. నవీన్ పట్నాయక్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. తన పనేదో తాను చేసుకు పోతుంటారు. అంతేకాదు కేంద్రం ప్రభుత్వ వ్యవహారంలో జోక్యం కూడా చేసుకోరు. తన ఒడిశా రాష్ట్రం వరకే ఆయన పరిమితమవుతూ వస్తున్నారు.ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ది రాజకీయాల్లోనే విలక్షణ శైలి. అందుకే ఆయన ప్రత్యర్థులకు అందనంత దూరంగా ఉంటారు. బ్రహ్మచారి అయిన నవీన్ పట్నాయక్ కుటుంబ బంధాలకు, స్నేహాలకు, మమతానురాగాలకు దూరంగా ఉంటారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెడతారు. అవినీతి అంటే నవీన్ పట్నాయక్ సహించరు. గతంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులను సయితం తొలగించి సంచలనం సృష్టించారుతాజాగా ప్రభుత్వ సిబ్బందిలోనూ అవినీతిని ఏమాత్రం సహించేది లేదని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపంిచారు. 11 మంది ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుని నవీన్ పట్నాయక్ అందరు ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని చెప్పక తప్పదు. 11 మంది అధికారుల్లో ఆరుగురిని డిస్మిస్ చేసేశారు. మరో ఐదుగురు ఉద్యోగుల పింఛన్లను నిలిపేశారు. తనకు అందిన నివేదికల మేరకు నవీన్ పట్నాయక్ ఈ చర్యలు తీసుకున్నారు.దీంతో పాటు మరో సంచలన నిర్ణయం ఏంటంటే.. తన తండ్రి సమాధిని కూడా తొలగించమని ఆదేశాలు జారీ చేయడం. నవీన్ పట్నాయక్ తండ్రి బిజూపట్నాయక్ సమాధి పూరిలో ఉంది. దీనిని స్మారక కేంద్రంగా తీర్చి దిద్దారు. అయితే ఇక్కడ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఎన్నికల సమయంలోనూ ఇదే ప్రధాన అంశంగా మారింది. దీంతో నవీన్ పట్నాయక్ తన తండ్రి సమాధిని, స్మారక కేంద్రంతో పాటు అన్నింటినీ తొలగించి శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. నవీన్ పట్నాయక్ తీసుకున్న ఈ నిర్ణయం విమర్శకులను సయితం కట్టిపడేసింది.