శ్రీ శివ మహా పురాణం - 13
త్ర్యంబకేశ్వరుడు
‘త్ర్యంబకం గౌతమీ తటే’ అని మనం అంటాము.
సహ్యాద్రి శీర్శే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్రదేశే,
యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తమ్ త్ర్యంబకమీశమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం – ౧౦)
త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు. ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు. ఇప్పటివరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది. త్ర్యంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇది కేవలము ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు. గౌతమ మహర్షి జీవితమును, ఆయన శీలమును, ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు. అక్కడి శివలింగం గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది. ఇక్కడ ఒక నది, ఒక శివలింగం ఆవిర్భవించాయి. మనం తెల్లవారి లేస్తే ఏ నదీజలములు త్రాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాము.గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ శంభు లింగారాధనము చేస్తుండేవాడు. ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు. ‘శం భావయతి ఇతి శంభుః’ – మంచి భావములను కల్పించ గలిగిన లింగమును ఆరాధనా చేశాడు. అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే. లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వతశిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమయిన జీవితమును గడుపుతున్నాడు.
ఇలా నడుస్తుండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమయిన క్షామం వచ్చింది. వర్షములు పడలేదు. ఎక్కడా నీరు లేదు. ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగామునకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు. చేస్తే వర్షములు పడతాయి. ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి నేను ఎలాగయినా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను’ అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. ‘నీవు తపస్సు చేశావు. సంతోషించాను. కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు. కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు. నేను అందులో నీళ్ళు పోస్తాను. ఒక వరం ఇస్తాను. ఆ కుండం ఆరదు. ఎప్పుడూ నీళ్లు ఉంటాయి’ అని చెప్పాడు వరుణుడు. అపుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది. తప్పకుండా అలా చేస్తాను’ అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు. అపుడు గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమయిన పంటలు పండించాడు. అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్లి చక్కగా ఆ పెట్టిన పదార్థముల నన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు. ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారు జామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి. వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్ళు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి. వాళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్ళారు. అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా, మీరు ఒక్కదారి అలా ప్రక్కకి తొలగితే మీము నీళ్ళు పట్టుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. స్త్రీలు అన్నారు ‘ మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది. మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం, అభిషేకం ఎక్కువయ్యాయా?అవతలికి పొండి ’ అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగివచ్చారు. అప్పుడు వాళ్లకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి ‘అమ్మా, ముని పత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం’ అని అడిగారు. ఆమాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది.
వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పిపొడిచారు. వాళ్ళలో అక్కసు బయలుదేరింది. వెళ్ళి భర్తలను “మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా?” అని అడిగారు. అలా భార్యలు అడిగేసరికి వాళ్లకి కష్టం వచ్చింది. వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిమఖము అనే మఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తిపొందిన గణపతి యజ్ఞ గుండంలోంచి ఆవిర్భవించాడు. ‘నేను మీకు ఏమి చేసిపెట్టాలి?” అని అడిగాడు. అపుడు వాళ్ళు ‘గౌతముడు పొగరెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి’ అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘ఇది మీరు అడగవలసిన మట కాదు. ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేకపోతె ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తొరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా? ఇది ఎంత కృతఘ్నత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు” అన్నాడు.అపుడు వాళ్ళు “నీ దగ్గర నీతులు వినదానిమి మేము ఈ మఖము చేయలేదు. మాకోరిక ఒక్కటే. గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతంది. కానినాడు నీవు కృతఘ్నుడవు అయిపోయినట్లు మేము భావిస్తాము” అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీకోరిక తీరుస్తాను. కానీ మీరు పాడయిపోతారు. తన ఉపాసన యందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్క్రుష్టమయిన కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సులో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు. ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు, ఆకుకూరలు వచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ గోవు రూపంలో వచ్చాడు మునుల కోర్కెను తీర్చడానికి గాను. బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డిపరక తీసి ఆవుమీద పడేసి ‘హ హ’ అన్నాడు. ఆ గడ్డిపరక పడగానే ఆవు చచ్చిపోయింది. నాకు గోహత్యాదోషం వచ్చింది’ అని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు. అక్కడికి అహల్య, ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు, మునిపత్నులు వచ్చారు. ఏమయిందని గౌతముని అడిగారు. జరిగింది చెప్పాడు గౌతముడు. అపుడు వారు’ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహా పాతకములు వస్తాయి. నీవు నీ భార్యను, శిష్యులను తీసుకుని ఆశ్రమం వదలి ఎక్కడికయినా పో’ అన్నారు. అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటె మేము ఉండము అంతేకాక ఈవేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు. గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజచేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. అదేమీ కుదరు పో’ అన్నారు. గౌతముని ప్రాణం ఈశ్వరార్చన. అప్పుడు ఆయన ‘అయ్యో, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం వుంటే చెప్పండి. నేనది చేసుకుని మరల నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను’ అన్నాడు. నిజానికి ఆయనకు తెలియని విషయమా? ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు. వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెడుతున్నారు. అపుడు వీళ్ళు ‘అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహా పాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చెయ్యి. అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది’ అని చెప్పారు. ఒకవేళ అలా చేయలేక పోయినట్లయితే వెళ్లి శంకరుని గూర్చి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమయిన తర్వాత గంగను ఇమ్మని అడుగు. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి. తర్వాత అఘమర్షణవ్రతం చెయ్యి. కోటి లింగములు పెట్టు. వాటికి అర్చన చెయ్యి. అలా చెయ్యి అన్నారు. మరల గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుడా ఉండేవిధంగా ఉపదేశం చేశారు.
గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమయిన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివ లింగమును తీసుకుని పంచాక్షరీ మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షం అయి ‘నాయనా, ఎందుకింత గొప్ప తపస్సు చేశావు?” అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ‘ఈశ్వరా నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవుని చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాక్కు కల్పించవలసినది’ అని ప్రార్థించాడు. శంకరుడు ‘అయ్యో పిచ్చివాడా. ఇంత తపస్సు చేసి పాపమును తియ్యమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నాడని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడయినా గౌతమమహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను’ అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరచి శంకరుని చూసి ఆహా పరమేశ్వరా, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టక పొతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయింది. వాళ్లకు నేను ఋణపడిపోయాను అన్నాడు.
తరువాత శివుడు ‘గౌతమా! ఏదైనా వరం కోరుకో ఇస్తాను’ అన్నాడు. అపుడు గౌతముడు స్వామీ మీరు నిజంగా నన్నుకానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచి పెట్టండి. నేను ఆంద్రదేశమునకు తీసుకువెడతాను’ అనగానే గభాలున గంగ స్త్రీరూపంలో పైనుండి క్రిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది. గౌతమునికి గంగాదర్శనం అయింది. వెంటనే ఆయన తన రెండు చేతులు ముకుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లీ అన్నాడు. అపుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తలమీద పడతాను. అపుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అయినట్లే. వెంటనే శివుని తలమీద వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమిమీద ప్రవహించను అన్నది. అపుడు గౌతముడు ‘అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లీ నేను కోరింది అన్నాడు. అపుడు గంగ శంకరుని వంక చూసి స్వామీ, గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి. అంది. శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు అమ్మా మేము మాత్రం ఏడాదికి ఒకమారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము. అని గంగామాతను ప్రార్థించారు. గంగ సరే సంవత్సరమునకు ఒకరోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది.గౌతముని మీద వెడుతున్న గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ త్ర్యంబకుడు అనే పేరుతో వెలశాడు. ఇది పరమశివుని అపారమయిన కారుణ్యమును, సౌలభ్యమును తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులయితే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ క్రింద పడిందిట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి, శిష్యుల తోటి, దిగుతున్నారు. గంగ వారిని చూసి ‘ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా? అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు.కొన్నిచోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది. అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే, గంగాస్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన అసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. ఆనాటి నుండి వాళ్ళు జడులై, తమ జీవితములను పాడుచేసుకుని తిరగసాగారు. ఆనాడు వెలసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వరుడు అని పిలవబడుతూ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్ర్యంబకుడు. అనగా మూడు కన్నులు కలవాడు. ఆ త్ర్యంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నుల వాడా మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు. ఒకనది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మనవరకు బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడయిన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.