విశాఖ వైసీపీలో ఫ్లెక్సీ రాజకీయాలు
విశాఖపట్నం, నవంబర్ 11
నాయకుడు అంటే జనంలో ఉండాలి, కానీ అధునికత పూర్తిగా అందుబాటులోకి వచ్చిన వేళ లీడర్లు గోడలకెక్కి ఫ్లెక్సీల మీద కనిపిస్తున్నారు. పుట్టిన రోజులు, ఇతర శుభ కార్యాలు ఇలా ప్రతి సందర్భంలోనూ ఫ్లెక్సీలనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. అన్ని పార్టీలలోనూ ఇది ఉన్నా జనాలకు చేరువ కాకుండా చేసే ఈ తరహా ఫ్లెక్సీ రాజకీయం సక్సెస్ అవదని తలపండిన రాజకీయ పెద్దలు అంటున్నారు. విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న సంగతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఎదురు లేదనిపించుకుంది. ఇక్కడ వైసీపీ జోరు కానీ జగన్ గాలి కానీ లేదు, ఇపుడే కాదు, 2014 ఎన్నికల నుంచి విశాఖ వైసీపీకి హ్యాండ్ ఇస్తూనే ఉంది. సాక్షాత్తు జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసే లక్ష మెజారిటీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. 2019 నాటికి కూడా అదే పరిస్థితి. దానికి కారణం ఫ్లెక్సీ నేతలేనని అంటున్నారు.వైసీపీకి ఆది నుంచి ఒక్కటే సమస్య. మొత్తం నగరానికి సంబంధించి ధీటైన నాయకుడు ఒక్కరూ లేరు. పోనీ నియోజకవర్గాల్లో బలంగా ఉన్న వారు చూద్దామంటే అక్కడా నిరాశే. పూర్తిగా జగన్ మీద ఆధారపడిపోయి రాజకీయం చేసే నేతలే విశాఖ వైసీపీలో కనిపిస్తారు. పేరుకు వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నేతలు అయితే ఉన్నారు, కానీ ఎవరికీ జనంలో పెద్దగా పలుకుబడిలేదు. వైసెపీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా విశాఖ పార్టీని ఇలా గాలికి వదిలేసిందనే చెప్పాలి. నగర వైసీపీ ప్రెసిడెంట్ గా వంశీక్రిష్ణకు బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన చురుకుగా వ్యవహరించడంలేదు.ఎన్నికల వేళ తనకు విశాఖ మేయర్ సీటు ఇస్తామన్న హామీ గురించే ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలాగే అంతకు ముందు అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ కి కూడా పట్టు లేదని తేలిపోయింది. ఆయన పాతిక వేల పై చిలుకు తేడాతో విశాఖ పశ్చిమం సీటు నుంచి ఓటమి పాలు అయ్యారు.విశాఖలో వైసీపీ ఆఫీస్ ఉంది. అక్కడ మీడియాను పిలిచి నాలుగు విమర్శలు టీడీపీ మీద చేస్తే పని అయిపోతుంది. ఫోటో పేపర్లో వస్తుంది అనుకునే బాపతే వైసీపీలో ఎక్కువగా ఉన్నారు. దాంతోనే పార్టీ ఎక్కడా ఎదగడంలేదని అంటున్నారు. ఇక ఫ్లెక్సీలు పెట్టుకుని రాష్ట్ర నాయకులమని చెప్పుకునే వారు కూడా వైసీపీలో ఉన్నారు. వారి వల్ల పార్టీకి ఎంత ఉపయోగమే తెలియదు కానీ వారు మాత్రం పార్టీ పేరు చెప్పుకుని కధ నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఉన్న నాయకులల్లో కూడా ఒకరంటే ఒకరికి పడదు, జీవీఎంసీ ఎన్నికలు వస్తున్నాయన్న ఆలోచన కూడాలేదు, పార్టీ బలోపేతం చేద్దామన్న తపన అంతకంటే లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి వస్తే ఆయన చుట్టూ చేరి ఫోటోలతో ఫోజులు కొట్టే వైసీపీ నేతలు ఆనక సొంత వ్యాపారాల్లో మునిగి తేలుతారని ప్రచారంలో ఉంది. ఈ సంగతులు తెలిసే జగన్ ఎవరికీ నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదని అంటారు. మరి ఫ్లెక్సీ నేతలు జనంలోకి వెళ్తేనే వారికీ, పార్టీకి కూడా భవిష్యత్తు ఉంటుంది అంటున్నారు సొంత పార్టీ కార్యకర్తలు.ఁ