వ్యాపారాలు, కేసులు వారిపైనే ఇద్దరు దృష్టి
విజయవాడ, నవంబర్11,
ముందున్న రోజులు మనవేనని టీడీపీీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో తరచూ చంద్రబాబు ఫోన్ లో టచ్ లో ఉంటున్నారు. ఆయన వ్యక్తిగతంగా కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. వారి నియోజకవర్గ సమస్యలతో పాటుగా వ్యక్తిగత సమస్యలు, వ్యాపారాల్లో ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్నా అది స్వల్పకాలమేనని గుర్తుంచుకోవాలని చంద్రబాబు సదరు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేల్లో పది మంది వరకూ వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలియడంతో చంద్రబాబు ప్రత్యేక భేటీలు చేస్తూ వారిలో భరోసా కల్పిస్తున్నారు.గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ రాజీనామా తెలుగుదేశం పార్టీని ఒక కుదుపు కుదిపేసింది. పైగా వంశీతో పాటు మరికొందరు అధికార పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. పది మంది శాసనసభ్యులు బయటకు వెళితే ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తనకు అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు.ప్రధానంగా కేసులు, వ్యాపారాలున్న ఎమ్మెల్యేలను వైసీపీ టార్గెట్ చేసే అవకాశముందని అనుమానిస్తున్న చంద్రబాబు తొలుత వారిపై ఫోకస్ పెట్టారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే తన వ్యాపారాలపై విజిలెన్స్ దాడులు పెరగడంతో ఆయన విలవిలలాడుతున్నారు. ఆయనకు వత్తిడులు ఎక్కువ కావడంతో పార్టీ మారతారన్న టాక్ విన్పించింది. దీంతో ఆ ఎమ్మెల్యేను పిలిచి చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. వ్యాపారాల్లో నష్టం వచ్చినా భరించ గలిగే శక్తి ఉండలని, రాబోయే రోజులు మనవేనని ఆ ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేశారంటున్నారు. అలాగే ఒక మాజీ మంత్రి కూడా వైసీపీలోకి వెళ్లేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తతానని, తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయనని, తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని కోరారట. అయితే ఇందుకు జగన్ నుంచి చిరునవ్వే సమాధానం రావడం, ఆ తర్వాత తాడేపల్లి నుంచి పిలుపు లేకపోవడంతో ఆ మాజీ మంత్రికి ఇక వైసీపీలోకి ఎంట్రీ లేనట్లే చెబుతున్నారు. ఈయనను చంద్రబాబు పిలిచి మాట్లాడాలనుకున్నా అందుబాటులో లేరు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలతో చంద్రబాబు వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. గుంటురూ జిల్లాకు చెందిన ఒక మాజీమంత్రిని కూడా పిలిచి చంద్రబాబు మాట్లాడారు. ఆయన నియజకవర్గాన్ని వదిలి ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీరందరితో చంద్రబాబు ఒకే మాట చెబుతున్నారు. త్వరలోనే జగన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోతుందని, న్యాయస్థానాల నుంచి ఇబ్బందులు జగన్ ఎదుర్కొనబోతున్నారని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో రాబోయే రోజులు మనవేనని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు.