పారదర్శతక ఏదీ..? (ప్రకాశం)
ఒంగోలు, నవంబర్ 11 (న్యూస్ పల్స్): సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు... రైతులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల నిర్వహణలో పారదర్శకత కొరవడుతోంది. చాలా చోట్ల వచ్చిన ఆదాయానికి లెక్కలు చూపక పోవడం, ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండగా- క్షేత్రస్థాయిలో పలు ఉదంతాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఆయా నిర్వహణ కమిటీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా... సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.వాగుల్లో వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకుని... మరిన్ని భూములకు సాగు నీరు అందించి, అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రైతులు తమ వాటాగా కొంత మొత్తం వెచ్చించాల్సి ఉన్నా... చాలా చోట్ల నిర్మాణ వ్యయం ప్రభుత్వమే భరిస్తోంది. తర్వాత నిబంధనలకు అనుగుణంగా... నిర్వహణ బాధ్యతలను ఆయకట్టు పరిధిలోని రైతులకు అప్పగిస్తుంది. సహకార చట్టం నిబంధనల ప్రకారం నిర్వహణ కమిటీని రిజిస్టర్ చేయాలి. ఆదాయ, వ్యయాలను ఏటా ఆడిట్ చేయించాలి. వచ్చే ఆదాయాన్ని విధిగా బ్యాంకు ఖాతాలో జమ చేసి కమిటీ తీర్మానం మేరమేవాటిని వినియోగించాలి. ఈ నిబంధనలన్నీ ఎక్కువ శాతం దస్త్రాలకే పరిమితమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఆడిట్ చేయిస్తున్న ఎత్తిపోతల పథకాలు జిల్లాలో చాలా తక్కువ. ఎక్కువ శాతం... నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న సభ్యులు తమ సొంత ఆస్తిలా వాడుకుంటున్నారు. ఆరు తడికి నీరివ్వాలంటే రైతుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొద్ది మంది మినహా మిగిలిన వారు... ఇలా తీసుకున్న సొమ్ముకు రసీదులు కూడా ఇవ్వడం లేదు. నిర్వహణ పేరిట రైతుల నుంచి వసూలు చేసిన సొమ్మును... ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నా పట్టించుకున్న వారు కరవయ్యారన్న విమర్శలు ఉన్నాయి. పథకాల మరమ్మతులకు మాత్రం ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుండడం గమనార్హం. ఎత్తి పోతల పథకాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఎకరానికి రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. పొగాకు, మిర్చి తదతర పైర్లకు రెండు, మూడు సార్లు నీరు పెట్టాల్సిన పరిస్థితి. వాగుల్లో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఏటా రూ. పది లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రైతుల నుంచి వసూలవుతోంది. ఈ పథకాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తున్నందున నిర్వహణ వ్యయం పెద్దగా ఉండటం లేదు. అయినప్పటికీ వసూలవుతున్న మొత్తానికి చాలా చోట్ల లెక్క చూపడం లేదు. ఆడిట్ ఊసెత్తడం లేదు. దస్త్రాల నిర్వహణ కూడా పట్టించుకోవడం లేదు. రైతుల నుంచి వచ్చిన మొత్తం ఏమవుతుందన్న విషయం పట్టించుకున్న వారూ కరవయ్యారన్న అపవాదు నెలకొంది.